పుడమి తల్లి రుణం తీర్చుకున్న మాతృమూర్తి
కంప్లి: ఈ రోజుల్లో తమ పిల్లలను ఏ డాక్టరో, ఇంజనీరో చేయాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. కానీ తనకు జన్మనిచ్చిన ఈ మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఆలోచించేవారు నూటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. ఆ ఒక్కరు.. హోస్‌పేట తాలుకా కమలాపురానికి చెందిన భువనేశ్వరి. భర్తను కోల్పోయి ఓ పూరింట్లో ముగ్గురు కొడుకులతో జీవనం సాగించేది. తన పెద్ద కొడుకు హరీష్‌ను బెళగాంలో జరిగిన మిలటరీ రిక్రూట్‌మెంటుకు పంపించింది. ఆ సెలక్షన్‌లో కుమారుడు అర్హత సాధించాడు. గత పదిహేను సంవత్సరాలుగా దేశ రక్షణలో ఉన్నారు.
తన రెండో కొడుకును కూడా మిలటరీ సెలక్షన్స్‌కు పంపించింది. ప్రస్తుతం రెండో కుమారుడు వినోద్‌కుమార్ కశ్మీర్- పంజాబ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ మాతృమూర్తి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దిగమింగి జీవనం సాగిస్తోంది. తన ఇద్దరు కొడుకులు సైన్యంలో పొందిన ప్రశంసలు, బహుమతులను భద్రపరుచుకునే స్థితిలో కూడా లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. అయితే జన్మనిచ్చిన ఈ భూమి రుణం తన కొడుకుల ద్వారా తీర్చుకోవడం తనకెంతో తృప్తిగా ఉందని అంటోంది. ఆ మాతృమూర్తి భువనేశ్వరికి మనం సెల్యూట్ చేసి జోహార్లు పలకాలి.