‘అమరావతి’పై జోక్యం చేసుకోండి
♦ యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు
♦ ఆహారభద్రతకు, నిపుణుల సూచనలకు, రైతుల హక్కులకు వ్యతిరేకం
♦ ప్రధానమంత్రికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో చట్టాల అతిక్రమణ, నిబంధనల ఉల్లంఘనలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజ్యసభ కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ పంపారు. ప్రతిపాదిత రాజధాని పర్యావరణానికి, ఆహారభద్రతకు, కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులకు, రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం తక్ష ణం 33వేల ఎకరాలు, భవిష్యత్‌లో 20 లక్షల ఎకరాల సాగుపై ప్రభావం చూపనుండడం ఆహారభద్రతకు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. అమరావతి ప్రాంతం మొత్తం వరద ప్రభావిత క్షేత్రమని, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 మేరకు కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి సరైన అనుమతులు తీసుకోలేదని లేఖలో వివరించారు. ఢిల్లీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేవీపీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
► సీఎంను విమర్శించడానికి మాట్లాడటంలేదు. భవిష్యత్‌లో ఇబ్బందుల్లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా.
► రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీలోని సభ్యులకు అర్హత, నైపుణ్యం, సాధికారికత ఉందనడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా ఉన్న నారాయణకు నైపుణ్యాలేమిటి? కమిటీలోని సభ్యులుగా ఉన్న వ్యాపారవేత్తలు రాజధాని నిర్మాణానికి ఎలాంటి సలహాలు ఇవ్వగలరు? వీరికి ఉన్న అర్హతలేమిటి? అవగాహన ఏమిటి? ఏ అథారిటీతో మాట్లాడి సురక్షిత రాజధాని ఇవ్వగలరు.. అనే అనుమానాలు ఉన్నాయి.
► కొండవీటి వాగు వరదతో 13వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రాంతంపై జాగ్రత్తలు తీసుకోవాలని సీఆర్‌డీఏ ఇచ్చిన నివేదికలో ఉంది. ళీ రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందడంలో 15లక్షల ఎకరాల పంటభూములు నిరుపయోగంగా మారుతాయని చెప్పడం జరిగింది.
► ఇంత విస్తీర్ణంలోని రాజధాని ప్రపంచంలో ఎక్కడా లేదు. పెద్ద రాజధాని వస్తుందని గర్వించాలా? లేక ఈ ప్రయత్నాల్లో ఏపీ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి చివరికి అయోమయపరిస్థితిలో కొట్టుకుపోతారా అనేది అర్థంకాని పరిస్థితి.
► సింగపూర్ కంపెనీ.. పూర్వం ఈస్ట్‌ఇండియా కంపెనీ తరహాలో చాలా షరతులు విధిస్తోంది. వీటితో అతి చిన్న దేశం సింగపూర్‌కు రాజధాని కాలనీగా మారబోతుందనే భయం వేస్తోంది.
► సీఎం చంద్రబాబు ఊహాలోకం నుంచి బయటకు వచ్చి వాస్తవం తెలుసుకోవడం అవసరం. బాబుకు అల్జీమర్స్ అనే వ్యాధి ఆరంభదశలో ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. దీనివల్ల ప్రాణాలకు ముప్పు ఉండదు కాని, జ్ఞాపకశక్తిలో తేడా వస్తుంది. దీని వల్ల ఏపీ ప్రజల భవిష్యత్ దెబ్బతినకుండా వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి.
► పర్యావరణానికి కనీస ప్రాధాన్యమివ్వడనడానికి బాబు ఉంటున్న ఇల్లే ఉదాహరణ. పర్యావరణ, ప్రజాభద్రతకు భంగంగా ఉన్న క్యాంపు, నివాసాన్ని కూల్చడానికి నోటీసులు ఇచ్చి నా,అందులోనే ఉండడం పర్యావరణ, చట్టాలు అవసరంలేదనే సంకేతాన్ని పంపుతున్నారు.