ఇదో 'రేప్' ప్రేమకథ! | Mumbai couple bonded by love, hounded by rape law | Sakshi
Sakshi News home page

ఇదో 'రేప్' ప్రేమకథ!

Published Mon, Jul 21 2014 1:38 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

ఇదో 'రేప్' ప్రేమకథ! - Sakshi

ఇదో 'రేప్' ప్రేమకథ!

పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు పక్కింటి అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. అతడి మాటలు నమ్మి సర్వస్వాన్ని అర్పించింది. ప్రియుడు మోసగించడంతో అతడిపై రేప్ కేసు పెట్టింది. కొన్నాళ్ల తర్వాత ప్రేమికుడు తప్పు తెలుసుకున్నాడు. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. పెళ్లికి ముందు పెట్టిన రేప్ కేసు వారిని వెంటాడుతోంది. దాన్ని నుంచి తప్పించుకునేందుకు ఈ జంట మరో న్యాయపోరాటం చేస్తోంది.

ముంబైలోని బోరివ్వీ ప్రాంతంలో ఈ ప్రేమకథ ప్రారంభమైంది. ఇరుగుపొరుగు నుండే ఈ గుజరాతీ యువతీ- ముంబై యువకుడు ఆరేళ్ల పాటు కళ్లతోనే మాట్లాడుకున్నారు. క్రమంగా వీరిమధ్య ప్రేమ చిగురించింది. వ్యాపారవేత్త కూతురు, రైల్వే ఉద్యోగి తనయుడైన ఈ యువ ప్రేమికులు 2012లో హద్దులు దాటారు. తర్వాత ఆమెను ప్రియుడు పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది మే 5న పోలీసులను ఆశ్రయించింది. ఇది జరిగిన వారం తర్వాత వారిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు.

పెళ్లి చేసుకున్నా వారి మధ్య 'రేప్' కేసు అడ్డుగోడగా మారింది. దాంతో ప్రియుడిపై మోపిన రేప్ అభియోగం తొలగించాలని ఆమె స్థానిక న్యాయస్థానాన్ని కోరగా అదంత సులభమైన విషయం కాదన్న సంగతి తెలిసింది. తామిద్దరం పరస్పర ఆమోదంతోనే లైంగిక చర్యలో పాల్గొన్నామని తమ న్యాయవాది ద్వారా కోర్టులో వాదనలు వినిపించినా రేప్ కేసు నుంచి విముక్తి లభించలేదు. దీంతో కేసు హైకోర్టుకు వెళ్లింది. బాధితులు, నిందితులు రాజీ పడితే రేప్ కేసును మూసేయొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రియుడి తరపు లాయర్ ఉటంకించారు.

అయితే వీరి వివాహాన్ని వారి తల్లిదండ్రులు ఆమోదిస్తే సమస్యను పరిష్కరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేశారు. ఈ 'రేప్' ప్రేమకథ ముగింపు ఎలా ఉంటుంటో వేచి చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement