
యూపీలో రెండు ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ
లక్నో: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలోని కర్కుదా గ్రామంలో రెండు ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఇరు వర్గాల వారు ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరుపుకోవడంతో పాటు రాళ్లు రువ్వుకున్నారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇరువర్గాల వారిపై పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. దాంతో వారు అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు.
ప్రస్తుతం గ్రామంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బలగాలను భారీగా మోహరించినట్లు చెప్పారు. స్థానిక ఛాపర్ వాలీ మసీదులో ముందు మేమే ప్రార్థనలు నిర్వహించాలని రెండు వర్గాలు పట్టబట్టాయి. ఆ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ ఘర్షణలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.
రాంపూర్, షహరాన్పూర్లో ఇటీవల రెండు మతస్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ ఘర్షణలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సహారన్‌పుర్‌లో కర్ప్యూ విధించారు. అయితే బుధవారం అయిదుగంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.