రేప్ జరుగుతుంటే ఫొటోలు తీశాడంతే!
''నా భర్తకు ఏమీ తెలియదు.. అతడు నిర్దోషి.. వాళ్లిద్దరూ తప్పుగా ప్రవర్తిస్తుంటే, ఆ విషయాన్ని సీనియర్లకు ఫిర్యాదు చేయడానికి దాన్ని ఫొటోలు తీశాడు. అంతేతప్ప అతడు రేప్ చేయలేదు'' అని పుణె ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో రేప్ కేసులో నిందితుడు ప్రకాష్ మహాదిక్ భార్య స్వప్న అంటున్నారు. పరితోష్ బాఘ్ (21) అనే క్యాంటీన్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన భర్త అరెస్టయ్యాడన్న విషయం తెలిసి స్వప్న పుణె చేరుకుంది. వాళ్లిద్దరూ టాయిలెట్‌లో అభ్యంతరకర పరిస్థితిలో ఉండగా ఆధారం కోసం తన భర్త ఫొటోలు తీశాడని, ఆ విషయాన్ని వాళ్లకు చెప్పేలోపే తప్పుడు కేసులో అతడిని ఇరికించారని ఆమె వాపోయింది. గత వారం కూడా తమ ప్రాంతంలో కొందరు యువకులు ఓ మహిళను ఏడిపిస్తుంటే వాళ్లతో గొడవపడ్డాడని, నిజంగా తన భర్తే అత్యాచారం చేసి ఉంటే.. తప్పనిసరిగా శిక్షించుకోవచ్చని ఆమె తెలిపింది.
క్యాంటీన్ బి3 భవనంలో ఉందని, అత్యాచారం మాత్రం బి12 భవనంలో జరిగిందని, క్యాంటీన్లోనే టాయిలెట్ ఉండగా.. ఆ మహిళ అంత దూరం వేరే భవనంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రకాష్ మహాదిక్ సోదరుడు మహేంద్ర ప్రశ్నించాడు. అయితే.. సంఘటన జరిగిన తీరు చాలా దారుణంగా ఉందని, అందుకే తాము కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్యాంటీన్ యజమాని ప్రభాకర్ శెట్టి చెప్పారు.