మోదీ ఎంఏ వివరాలు వెల్లడించలేరట!
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేయడం నిజమేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆర్టీఐ యాక్టివిస్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మోదీ పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేసినట్టు తానే స్వయంగా అఫిడవిట్లలో పేర్కొనడం, ఆయన 1981 నుంచి 1984 మధ్య గుజరాత్ యూనివర్శిటీలో చదివి మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలియజేస్తున్న నేపథ్యంలో....1981-1984 మధ్య మాస్టర్ డిగ్రీలు తీసుకున్న విద్యార్థుల వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఆర్టీఐ కార్యకర్త గుజరాత్ యూనివర్శిటీకి దరఖాస్తు చేశారు. 2005 నాటి ఆర్టీఐ చట్ట ప్రకారం ఈ వివరాలు వెల్లడించలేమంటూ యూనివర్శిటీ నుంచి సదరు దరఖాస్తుదారునికి ఏకవాక్య సమాధానం వచ్చింది.
ప్రధాన మంత్రి మోదీ మాస్టర్ డిగ్రీ వివరాలు కావాలంటూ నేరుగా అడిగితే ఇవ్వకపోవచ్చని, పైగా తనను టార్గెట్ చేయవచ్చనే ఉద్దేశంతోనే మోదీ చదివిన కాలానికి చెందిన విద్యార్ధుల వివరాలు అడగాల్సి వచ్చిందని ఆర్టీఐ కార్యకర్త స్థానిక మీడియాకు వివరించారు. మరో ఆర్టీఐ కార్యకర్త మోదీ విద్యాభ్యాస వివరాలు కావాలంటూ ఆర్టీఐ చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరగా, వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన విషయం తెల్సిందే. మోదీ మంత్రివర్గంలోని స్మృతి ఇరాని డిగ్రీపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కొంత మందికి మోదీ డిగ్రీలపై కూడా అనుమానాలు వచ్చాయి. వాటిని ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఫలితం ఉండడం లేదు.