'ముస్లింలను పాకిస్థాన్ పొమ్మనలేదు'
'ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే ఆవు మాంసం తినడం మానుకోవాల్సిందే. ఆవు ఇక్కడ విశ్వాసానికి ప్రతీక' అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెనుకకు తగ్గారు. ముస్లింల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించారని పేర్కొన్నారు. అయినా, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన గాయపడితే.. చింతిస్తున్నానని అన్నారు.
ముస్లింలు భారత్లో ఉండొద్దని, వారు పాకిస్థాన్కు వెళ్లిపోవాలని తాను వ్యాఖ్యలు చేసినట్టు ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. ముస్లింలు భారత్లో ఉండాలంటే బీఫ్ తినొద్దంటూ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన వ్యాఖ్యలకు సొంత పార్టీ బీజేపీ కూడా దూరం జరిగింది.
బీఫ్ విషయమై దాద్రిలో ముస్లిం వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ విషయమై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కమలం అధినాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఖట్టర్ అభిప్రాయాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆహార అలవాట్లు ప్రజల వ్యక్తిగతమని, దీనిని మతానికి ముడిపెట్టి చూడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నేతలు వ్యాఖ్యలు చేయాలని పేర్కొన్నారు.