
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విభజన
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను విభజించి.. ఒకటి, రెండో అంతస్తులను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి (టీటీడీపీ) కేటాయించారు. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సైకిల్‌పై ర్యాలీగా వచ్చి టీటీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్.. చెత్తనగరంగా మార్చిందని విమర్శించారు. బీసీలు, మహిళలు, యువత, రైతులు, దళితులు, గిరిజనులకు టీడీపీ వేదికగా వుంటుందని.. టీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేరలేదన్నారు. కేసీఆర్ అభివృద్ది త్రీడీ సినిమాలు, ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు.
కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించే వేదికగా టీడీపీ నిలుస్తుందని.. చంద్రబాబు మార్గదర్శకత్వంలో పార్టీకి తెలంగాణకు పూర్వ వైభవం తెస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు టీడీపీ కృషి చేసిందని పార్టీ అధ్యక్షుడు రమణ అన్నారు. కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల ఖర్చు చేసామని చెప్తున్నా.. ఏ వర్గం సంక్షేమానికి ఖర్చు చేసిందో తెలియడం లేదన్నారు. ఈ సందర్భంగా జూబ్లిహిల్స్‌కు చెందిన ప్రదీప్ చౌదరి టీడీపీలో చేరగా.. రమణ, రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడైన ప్రదీప్ చౌదరి గతంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరూ టీఆర్‌ఎస్‌లో ఇమడలేక పోతున్నారని.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని ప్రదీప్ చౌదరి ఆరోపించారు.