ఢిల్లీ: తెలంగాణలో తెలుగు దేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందని ఓ మీడియా వర్గం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారాయన.
రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తెలంగాణపై అసత్య ప్రచారాలు చేస్తూ.. పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయని పరోక్షంగానే టీడీపీపై ఆయన సెటైర్లు వేశారు. గురువారం జరిగిన ఓ అనధికార సమావేశంలో తాను పరోక్షంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చేసినట్లు ఓ సెక్షన్ మీడియా కథనాలు రాసిందని ఆయన ప్రకటనలో మండిపడ్డారు. పార్టీకి దురుద్దేశ్యాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనం సృష్టించినట్లు అర్థమవుతోందని ఆయన తేల్చేశారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్)ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని, రాష్ట్రంలో తమ పార్టీనే ప్రత్యామ్నాయమని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పొత్తు పుకార్లను సృష్టించొద్దంటూ సదరు వర్గ మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ భవన్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment