ఐజ్వాల్: గ్రామీణ పేదల గృహనిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మిజోరంపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో గృహనిర్మాణ అవసరం చాలా ఎక్కువగా ఉందనే విషయం తనకు అర్థమైందని, త్వరలో ప్రారంభమయ్యే పథకంతో వారి అవసరాలు తీరతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా యువతను కోరారు. క్రీడలకు భవిష్యత్‌లో బంగారు భవిష్యత్ ఉందని, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని తెలిపారు. కంప్యూటర్ విద్యను సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. మయన్మార్ సిట్వే పోర్ట్‌ను అనుసంధానిస్తూ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ దశాబ్దకాలంలో లేనంతగా యూపీఏ హయాంలో ఆర్థికాభివృద్ధి జరిగిందని చెప్పారు. పేదరికం మూడొంతులు తగ్గిందని తెలిపారు.