కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లోనే రిటైర్ అయిన కుమార్కు సంబంధించి ఇది రెండో పొడగింపు. ప్రస్తుతం ఎన్ఐఏ పర్యవేక్షిస్తోన్న ఉడీ ఉగ్రదాడి, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి, బుర్ద్వాన్, సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో పేలుడు తదితర కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో డీజీ మార్పు సరికాదన్న అభిప్రాయం మేరకు ఆయన పదవికాలాన్ని పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి.
అయితే కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాత్రం ఎన్ఐఏ చీఫ్ కొనసాగింపును తప్పుపట్టారు. శరద్ కుమార్ హిందూ సంస్థ ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మక్కా మసీదు పేలుడు, మాలేగావ్, మోదాసా పేలుళ్ల కేసుల దర్యాప్తు నీరసంగా సాగుతుండటాన్ని ఉదహరిస్తూ.. ముస్లిం నిందితుల విషయంలో ఒకరకంగా, హిందూ ఉగ్రవాదుల విషయంలో మరో రకంగా ఎన్ఐఏ వ్యవహరిస్తోందని విమర్శించారు.
1979 ఐపీఎస్ బ్యాచ్ హరియాణా క్యాడర్ కు చెందిన శరద్ కుమార్ 2013, జులై 30న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2015 అక్టోబర్ లో ఉద్యోగ విరమణ చేయాల్సిఉండగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు సర్వీసును పొడిగించింది. తాజా పొడగింపుతో 2017 అక్టోబర్ వరకు శరద్ కుమారే ఎన్ఐఏ చీఫ్ వ్యవహరించనున్నారు.