ఫెడ్ జోష్.. మార్కెట్లు లాభాల్లో ప్రారంభం
ఫెడరల్ రిజర్వు మీటింగ్పై దేశీయ సూచీలు సానుకూలంగా స్పందిస్తూ గురువారం నాటి ట్రేడింగ్లో లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా దూసుకెళ్లి ప్రస్తుతం 112.36 పాయింట్ల లాభంలో 28117 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ తన కీలక మార్కు 8,650ను పునరుద్ధరించి, 33.75 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతోంది. ఫెడరల్ రిజర్వు నుంచి రాత్రి వెలువడిన సానుకూల సందేశాలతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
పాలసీని త్వరలోనే కఠినతరం చేస్తామని జూలై పాలసీ మీటింగ్లో ఫెడ్ రిజర్వు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. వడ్డీరేట్ల పెంపుకు మరింత మెరుగైన ఎకానమిక్ డేటా అవసరమని పాలసీ మేకర్లు బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సందేశాలతో 2016 ఫెడ్ రేటు పెంపు లేనట్టేనని వెల్లడవుతోంది. దీంతో అటు ఆసియన్ మార్కెట్లకు, ఇటు దేశీయ మార్కెట్లకు సానుకూల పవనాలు వీచాయి.
ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్లు నిఫ్టీలో హెవీ వేయింట్గా నిలుస్తున్నాయి. 2.32 శాతం లాభంతో పవర్ గ్రిడ్ టాప్ నిఫ్టీ గెయినర్గా ట్రేడ్ అవుతోంది. హీరో మోటార్ కార్పొ, ఐసీఐసీఐ, అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. కోల్ ఇండియా, విప్రో, ఎల్ అండ్ టీ, అరబిందో ఫార్మా, హిందుస్తాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీలు నష్టాలను గడిస్తున్నాయి.
అటు డాలర్తో పోలిస్తే రూపాయి 0.05 పైసలు బలహీనపడి 66.82గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 88 రూపాయల నష్టంతో 31,379.0 ట్రేడ్ అవుతోంది.