ఆన్‌లైన్ టోకరా కేసులో మరో నైజీరియన్ అరెస్ట్ | Nigerian arrested in online cheating case | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ టోకరా కేసులో మరో నైజీరియన్ అరెస్ట్

Published Thu, Aug 13 2015 9:52 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

Nigerian arrested in online cheating case

హైదరాబాద్ సిటీ: విదేశీ లాటరీ వచ్చిందంటూ సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్) పంపి, వివిధ చార్జీల పేరుతో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి నుంచి నగదు కాజేసిన ముఠాలో మరో నిందితుడిగా ఉన్న నైజీరియన్ యుహుమ్‌వాన్సెబో జెరెమీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇతడు కూడా కీలక పాత్ర పోషించినట్లు అదనపు డీజీ సీహెచ్ ద్వారక తిరుమలరావు గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఎబెగా మిఛెల్ అలియాస్ జెఫ్ మోర్గాన్, యుహుమ్‌వాన్సెబో జెరెమీ అలియాస్ ఒసా నాలుగేళ్ళ క్రితం స్టడీ వీసాపై భారత్‌కు వచ్చిన ఢిల్లీలో స్థిరపడ్డారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా అనేక మంది సెల్‌ఫోన్లకు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించారు. ఆన్‌లైన్ లాటరీ, అవార్డు, క్యాష్‌ప్రైజ్ తదితరాలు వచ్చాయంటూ ఎరవేస్తాడు. ఆకర్షితులై సంప్రదించి వారితో ఫోనులో మాట్లాడి ముగ్గులోకి దించుతారు.

ఈ ముఠా ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు చెందిన టైల్స్ వ్యాపారి కె.వెంకటేశ్వరరెడ్డికి ఓ ఎస్సెమ్మెస్ పంపాడు. యూఎస్ సామ్‌సంగ్ లాటరీలో భారీ మొత్తం వచ్చిందని, నగదు కోసం తమను సంప్రదించాలని వీటిలో పేర్కొన్నాడు. దీనికి ఆకర్షితుడైన వ్యాపారి ముఠాతో ఫోను, ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వెంకటేశ్వరరెడ్డి పూర్తిగా ముగ్గులోకి దించిన తరవాత నగదు రిలీజ్ కావడానికి ఆదాయపు పన్ను, నగదు మార్పిడి చార్జీలు, కస్టమ్స్ డ్యూటీ పేర్లు చెప్పి వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.79 లక్షలు జమ చేయించుకున్నాడు.

దాదాపు మూడు నెలల పాటు ఎదురు చూసినా లాటరీ సొమ్ము రాకపోవడం, ఎబెగా మిఛెల్ స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించిన వ్యాపారి సీఐడీ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ కె.శివాజీ తన బృందంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఎబెగా మిఛెల్ హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్నాడని గుర్తించి జూన్ 25న అరెస్టు చేశారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, లాప్‌టాప్‌లను విశ్లేషించిన నేపథ్యంలో యుహుమ్‌వాన్సెబో జెరెమీ సైతం కీలక నిందితుడిగా తేలింది.

దీంతో మరోసారి ఢిల్లీ వెళ్ళిన ప్రత్యేక బృందం మంగళవారం ఇతడిని పట్టుకుంది. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై గురువారం హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మిమోసపోవద్దని ఎస్పీ టాటా సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement