2024 నుంచి జమిలి ఎన్నికలు
- కార్యాచరణ నివేదికలో నీతిఆయోగ్ సూచన
న్యూఢిల్లీః లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే వాదన మరింత బలపడుతోంది. 2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో రెండు దశలుగా నిర్వహించాలని నీతిఆయోగ్ సూచించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలన్నీ స్వేచ్ఛగా, సజావుగా సాగాలని,మితిమీరిన వ్యయానికి అడ్డుకట్ట వేయాలని నీతిఆయోగ్ తన మూడేళ్ల కార్యాచరణ అజెండాపై రూపొందించిన నివేదికలో పేర్కొంది.
‘2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో మనం ఏకకాల ఎన్నికల దిశగా అడుగులు వేయాలి...ఈ క్రమంలో కొన్నిరాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్ని రాష్టాల అసెంబ్లీల గడువును కుదించడమో జరగాల’ని నీతిఆయోగ్ సూచించింది. ఈ కసరత్తును ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్యాంగ నిపుణులు, మేథావులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన వేదిక ఏర్పాటు కావాలని పిలుపు ఇచ్చింది. ఏకకాల ఎన్నికల కోసం రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమైనందున దీనిపై అంగీకారం కుదిరేలా చొరవ చూపాలని స్పష్టం చేసింది.
జమిలి ఎన్నికల కసరత్తుకు ఎన్నికల కమిషన్ నోడల్ ఏజెన్సీగా ఉండాలని, 2018, మార్చి నాటికి కార్యాచరణను సిద్దం చేసుకోవాలని నీతిఆయోగ్ సూచించింది. దేశంలో నిత్యం ఎన్నికలు జరుగుతుండటంతో అనవసర వ్యయంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం విదితమే. ఏకకాల ఎన్నికలకు ప్రధాని, రాష్ట్రపతి మొగ్గుచూపిన క్రమంలో నీతిఆయోగ్ తాజా సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.