బీజేపీతో పొత్తుపై నితీశ్ క్లారిటీ
పెద్దనోట్లను రద్దును మొదటినుంచి బాహాటంగా సమర్థిస్తున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. నితీశ్‌కుమార్ మాత్రం నోట్లరద్దును సమర్థించడమే కాదు.. దీనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత దోస్త్ అయిన బీజేపీతో నితీశ్‌కుమార్ మళ్లీ పొత్తు పెట్టుకోవచ్చునని, బిహార్‌లోని మహాకూటమి నుంచి దూరం జరిగి.. తిరిగి కమలదళంతో ఆయన జతకట్టవచ్చునని కథనాలు వస్తున్నాయి.
తాజాగా హిందూస్తాన్‌టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీనియర్ పాత్రికేయురాలు బర్ఖాదత్‌తో మాట్లాడుతూ నితీశ్ ఈ విషయంపై స్పందించారు. మళ్లీ ఘర్‌వాప్సీ ప్రసక్తే లేదని, బిహార్ మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలను గందరగోళపరిచేందుకే వదంతులను వ్యాప్తిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తిరిగి బీజేపీలోకి తనను ఆహ్వానిస్తూ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో మరోసారి పెద్దనోట్ల రద్దు సంస్కరణను నితీశ్ స్వాగతించారు.