'మా వాళ్లు ఉన్నారో చనిపోయారో తెలియదు'
కోల్ కతా/కఠ్మాండు: తమ కుటుంబం వాళ్లు ప్రాణాలతో ఉన్నారో.. చనిపోయారో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భారత్ లోని నేపాల్ కాన్సులేట్ అధికారులు. గత శనివారం నేపాల్ ను భారీ భూకంపం తీవ్ర నష్టంలో ముంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య నాలుగువేలు దాటింది. ఈ నేపథ్యంలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో అనే విషయం కూడా తెలియక సర్వం స్తంభించి పోయి నేపాల్ అల్లాడుతోంది.
ఈ నేపథ్యంలో ఘటనపట్ల భారత్లోని నేపాల్ కాన్సులేట్ కార్యాలయంలో పనిచేసే అధికారులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని చెప్పారు. మూడు రోజులుగా ఇంటికి వెళదామని తమ వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా ఎలాంటి స్పందన రావడం లేదని, తమ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందోనని, వారు బతికి ఉన్నారో, చనిపోయారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సులేట్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారుల కుటుంబాల జాడ తెలియడం లేదని తెలిపారు.
4,347కు పెరిగిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య 4,347కు పెరిగింది. ఇది పెరగవచ్చని మంగళవారం అధికారులు తెలిపారు. మొత్తం పన్నెండు రాష్ట్రాలు భూకంపం బారిన పడగా వాటిలో కఠ్మాండు, సింధుపాల్చౌక్లలో వరుసగా 1,039, 1,176 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇక గాయపడిన వారి సంఖ్య కూడా 7,500కు పెరిగింది. చాలామంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు శరవేగం కొనసాగుతున్నాయి.