పాక్ తో చర్చల ప్రసక్తే లేదు!
న్యూఢిల్లీ పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి, హింసాకాండకు పాకిస్థాన్ స్వస్తి చెప్పనిదే ఆ దేశంతో చర్చలు జరపడం సాధ్యంకాదని ఆయన ప్రకటించారు. ఈ నెలలో నేపాల్‌లో జరగనున్నసార్క్ హోం మంత్రుల ఆరవ సమావేశం సందర్భంగా, నేపాల్ రాజధాని కాఠ్మండ్ లో పాక్ హోంమంత్రితో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కాబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
హింసకు , ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకూ ఆ దేశంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని, దీనిపై మీడియాలో వార్తల్లో వాస్తవం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 18, 19 తేదీల్లో నేపాల్ వెళ్లనున్నారు.