ముల్తాన్: ప్రపంచ కప్ పోరుకు ముందు మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సమరంలో ఆరు జట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లకు వరల్డ్ కప్‌కు ముందు ఇది ట్రయల్‌గా ఉపయోగపడనుండగా... వరల్డ్ కప్ బరిలో లేని నేపాల్ ఆరో టీమ్‌గా తన ఉనికిని ప్రదర్శించే ప్రయత్నం చేయ నుంది. అన్నీ జట్లూ సహజంగానే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా... ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
కనీసం రెండు సార్లు ఇరు జట్లు తలపడే అవకాశం ఉండగా, ఫైనల్ చేరితే మరోసారి దాయాదుల మధ్య పోరును చూడవచ్చు. నేడు సొంతగడ్డపై జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు రోహిత్ కుమార్ సారథ్యంలోని నేపాల్‌తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్–4 దశలో మిగిలిన మూడు టీమ్‌లను ఎదుర్కొన్న తర్వాత టాప్–2 టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి.
ఫేవరెట్‌గా రోహిత్ బృందం...
ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్ జరగ్గా అప్పుడు రాబోయే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టి20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కు సరిగ్గా నెల రోజుల ముందు వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ సహజంగానే ఫేవరెట్‌గా కనిపిస్తుండగా... వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది.
భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతుంది. భారత జట్టు ఇటీవల ప్రదర్శన, వ్యక్తిగతంగా ఆటగాళ్ల రికార్డులు, టీమ్ కూర్పును బట్టి చూస్తే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉండగా, అఫ్గానిస్తాన్ కూడా సంచలనాలు ఆశిస్తోంది.
అధికారికంగా ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ బోర్డుకే ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లలో 4 మాత్రమే పాకిస్తాన్‌లో జరుగుతుండగా, శ్రీలంక 9 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు వాన కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment