మరో నాలుగు రాష్ట్రాల్లో నిషేధం
ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లో ‘మ్యాగీ నూడుల్స్’పై చర్యలు
♦ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియాకు ఆదేశం
♦ చర్యలకు సిద్ధమవుతున్న బిహార్, ఉత్తరప్రదేశ్
న్యూఢిల్లీ: హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై మరో నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఉత్తరాఖండ్, తమిళనాడులో మూడు నెలలు, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో ఒక నెల చొప్పున నిషేధం విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు గురువారం ప్రకటించాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేదని పరీక్షల్లో తేలిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టంచేశాయి.
అలాగే తమ రాష్ట్రాల నుంచి మ్యాగీ నూడూల్స్ సరుకును తక్షణమే ఉపసంహరించాలని నెస్లే ఇండియా సంస్థను ఆదేశించాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మ్యాగీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు నూడుల్స్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఫలితాలు రాగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం బుధవారమే మ్యాగీ నూడుల్స్‌పై 15 రోజులపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్ సర్కారు మ్యాగీ నూడుల్స్‌తోపాటు సన్‌ఫీస్ట్, ఎస్‌కేఎస్ ఫుడ్స్‌కు చెందిన న్యూడుల్స్‌పైనా పరీక్షలు నిర్వహించింది.
ఇందులో ఎస్‌కేఎస్ నూడుల్స్‌లో లెడ్(సీసం) మోతాదు పరిమితికి మించి ఉండడంతో వాటిపైనా 15 రోజుల నిషేధం విధించింది. ‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 27 మ్యాగీ నూడుల్స్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చే శాం. అందులో 14 శాంపిళ్లలో సీసం శాతం మోతాదుకు మించి నమోదైంది. ఇక అన్ని నమూనాల్లో హానికారక మోనోసోడియం గ్లుటామేట్(ఎస్‌ఎస్‌జీ) ఆనవాళ్లు కనిపించాయి’’ అని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. ఇక పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ హానికారకం కాదు అని తేలే వరకు ఒక్క జిల్లాలో కూడా వాటిని అమ్మకుండా చూడాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాగీపై మూడునెలలపాటు నిషేధం విధించినట్లు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఓం ప్రకాశ్ తెలిపారు. పరీక్షలకు పంపిన కొన్ని శాంపిళ్లలో ఎంఎస్‌జీ ఉన్నట్టు తేలిందని, మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉందని ఆయన వివరించారు. కాగా, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మ్యాగీ నూడుల్స్‌పై నేపాల్ కూడా దృష్టి సారించింది. వాటిని పరీక్షలకు పంపింది. ఫలితాలు వచ్చాక నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది.
నూడుల్స్ ఉపసంహరించిన వాల్‌మార్ట్, మెట్రో ఏజీ
వాల్‌మార్ట్, మెట్రో ఏజీ సంస్థలు తమ హోల్‌సేల్ స్టోర్‌ల నుంచి మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించాయి. ‘మ్యాగీ 2-మినిట్ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మా సంస్థకు చెందిన 20 స్టోర్‌ల నుంచి ఆ సరుకును ఉపసంహరిస్తున్నాం. ప్రజారోగ్యానికి మేం పెద్దపీట వేస్తాం’ అని వాల్‌మార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ కూడా భారత్‌లో 18 స్టోర్‌ల నుంచి మ్యాగీని ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంది.