
ఆ కేసు ఏమీ కాదులెండి
‘‘ఆ కేసు ఏమీ కాదులెండి. వదిలేయండి. 26 కేసులు వేశారు. ఏమయ్యాయి?’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు వ్యాఖ్యానించారు.
- సుప్రీంకోర్టు నోటీసులపై చంద్రబాబు వ్యాఖ్య
- వాళ్లకు ఈ కేసులేయడం కొత్తకాదు...
- 26 కేసులు వేశారు.. ఏమయ్యాయి?
- మంత్రివర్గంపై చెప్పింది చేయను... చేసేది చెప్పను...
సాక్షి, అమరావతి: ‘‘ఆ కేసు ఏమీ కాదులెండి. వదిలేయండి. అలా కేసులు వేస్తుండడం వారికి అలవాటే. ఇది ఇప్పుడు కొత్తకాదు. ఒకటి అయ్యాక ఇంకొకటి వేస్తూనే ఉంటారు. 26 కేసులు వేశారు. ఏమయ్యాయి?’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి చంద్రబాబుకు నోటీసులు జారీచేయడంపై ఆయన పైవిధంగా స్పందించారు. వెలగపూడి కొత్త తాత్కాలిక అసెంబ్లీ భవనాల్లోని కమిటీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తుచేయగా అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా మీడియాకు ఇతర సమాచారాన్ని వివరిస్తున్న ఆయన ముఖకవళికలు మారిపోయాయి. లిప్తకాలంపాటు తత్తరపడి తేరుకుని ‘‘వాళ్లు కేసులు వేయడం ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటికే నాపై 26 కేసులు వేశారు. కొన్నిటిని కోర్టులే కొట్టేశాయి. అయినా వేస్తూనే ఉన్నారు. వారికిదో అలవాటు. గతంలో నాపై ఎక్సైజ్ కేసు వేస్తే 12 ఏళ్లపాటు కొనసాగింది. కేసులు ఏమీ కావు. ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టులో వాళ్లు కేసులు వేయగా న్యాయస్థానం వారికి మొట్టికాయలు కూడా వేసింది. అయినా తీరు మారలేదు. వాళ్లంతే. అవన్నీ వదిలేయండి’’ అని చెప్పారు. ఓటుకు కోట్లు కేసు గురించి మరింత స్పష్టమైన వివరణ కోసం సాక్షి ప్రతినిధి ప్రయత్నించగా... ‘‘ఎవరేం చేస్తున్నారో తెలుసు. మీరే చేయిస్తున్నారు. నువ్వు అక్కడ చేరి ఏం చేస్తున్నావో తెలుసు’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
ప్రతిభ ఉందనే లోకేశ్‌కు పదవి
ప్రతిభను గుర్తించే నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్పుడు ‘‘లోకేష్‌తో సహా ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవులకు ఎంపికైన వారంతా ఆ పదవులకు అర్హులే. వారి ప్రతిభ మీదనే పదవులు ఇచ్చాను. ఎవరు పని చేస్తున్నారో వారికి పదవులు వస్తాయి. పార్టీ కోసం పనిచేస్తున్నందునే లోకేశ్, అర్జునుడులకు పదవులు ఇచ్చాను. గతంలో అనివార్య కారణాల వల్ల పదవులు ఇవ్వలేకపోయాను. వారంతా పార్టీకి సహకరించారు. పార్టీ పట్ల విధేయత, సమర్థతలను గుర్తించి ఇప్పుడు కొందరికి ఇచ్చాం. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించాలనుకున్నాం. ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుంది’’ అని చంద్రబాబు వివరించారు. మంత్రివర్గంలోకి తీసుకుం టారా? అని ప్రశ్నించగా ‘‘ఎప్పుడైనా నేను ముందుగా చెప్పానా? మీకు ముందుగా చెప్పానా? అయినా నేను ఎప్పుడైనా చెప్పింది చేశానా... చేసేది చెపుతానా...’’ అంటూ నవ్వుతూ దాటవేశారు.