
ఒబామా గిన్నిస్ రికార్డు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ట్విట్టర్లో ఖాతా తెరిచిన ఐదు గంటల్లోనే ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించి, ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. @POTUS అనే పేరుతో ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరుమీద తెరిచిన అకౌంట్కు కేవలం ఐదు గంటల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చిన విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది.
ఇంతకుముందు నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22 నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. ఒబామాకు ఇంతకుముందే @BarackObama అనే ఐడీతో ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అధికారిక ఖాతా కోసం దీన్ని కొత్తగా తెరిచి, అంతలోనే పనిలో పనిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించేశారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. ఇది కేవలం బరాక్ ఒబామాది మాత్రం కాదు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేసేస్తామని వైట్హౌస్ ఇంటర్నెట్ స్ట్రాటజీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెక్స్ వాల్ తెలిపారు.