'ములాయం సింగ్ యాదవ్ హిజ్రా'
ములాయం సింగ్ యాదవ్ నమ్మిన బంటు, సమాజ్వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఏకంగా తమ అధినాయకుడు ములాయంపై గతంలో ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వెలుగు చూడడంతో ఖాన్ కంగుతిన్నారు. ఇప్పటికే చుట్టుముట్టిన సమస్యలకు తోడు పాత వీడియో కొత్తగా బయటకు రావడంతో ఆజంఖాన్ వ్యవహారం అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.
అనధికారికంగా యూపీ కేబినెట్లో నెంబర్ 2గా కొనసాగుతున్న ఆజంఖాన్ కొంతకాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వక్ఫ్బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీనికి ఆజంఖానే కారణమంటూ షియా పెద్దలు సీఎం అఖిలేష్ కు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ శాఖను ఆజంఖాన్ నియంత్రణ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇక నాలుగేళ్ల క్రితం పార్టీని వదిలి బయటకు వెళ్లిన అమర్ సింగ్ ను మళ్లీ ములాయం చేరదీయడం ఆజంఖాన్ కు కంటగింపుగా మారింది.
ఈ నేపథ్యంలో 2009లో తన సొంత నియోజకవర్గం రాంపూర్ లో బహిరంగ సభలో ఆజంఖాన్ చేసిన ప్రసంగం వీడియో మంగళవారం ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. తన ప్రసంగంలో ములాయంను హిజ్రా(నపుంసకుడు)గా సంబోధించారు. ఒక్కసారి కాదు... పలుమార్లు ఈ వ్యాఖ్య చేశారు. తన నియోజకవర్గలంలోని సౌర్ తండా, మిలాక్, బిలాస్పూర్ ప్రాంతాలకు కొత్త రాష్ట్రాలకు తరలిపోకుండా ఆపడంలో ములాయం విఫలమయ్యారని, ఆయన హిజ్రాగా వ్యవహరించారని మండిపడ్డారు.
అయితే ఐదేళ్ల తర్వాత ఈ వీడియో విడుదల చేయడం వెనుకున్న ఉద్దేశమేమిటో తెలియడం లేదు. ఇన్నాళ్లు దాచిపెట్టి ఇప్పుడు విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ములాయం, ఆజంఖాన్ మధ్య దూరంగా పెరుగుతున్న దశలో ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. అధినేతపై చేసిన 'హిజ్రా' వ్యాఖ్యలను వివాదస్పద నేతగా ముద్రపడిన ఆజంఖాన్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి.