రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | omorrow srivari brahmotsavalaku Initiative | Sakshi
Sakshi News home page

రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Published Mon, Sep 14 2015 10:09 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - Sakshi

రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ముమ్మరంగా ఏర్పాట్లు
సాక్షి, తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి చేరుకుని వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లను టీటీడీ ముమ్మరం చేసింది.

ఎల్లుండి ధ్వజారోహణం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి, బ్రహ్మోత్సవాల వాహన సేవలకు నాంది పలుకుతారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
 


బ్రహ్మోత్సవాలకు భద్రతావలయం
 అడుగడుగునా ఇనుప కంచెల నిర్మాణం
గోదావరి పుష్కరాలు మిగిల్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఇనుప కంచెల దిగ్బంధనంలో ఈ నెల 16 నుంచి తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాహన సేవలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఎక్కడికక్కడ కట్టడిచేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
పన్నెండడుగుల ఎత్తులో భారీ ఇనుప కంచె..
భద్రతా కారణాల రీత్యా ఇప్పటికే తిరుమల నాలుగు మాడ వీధుల చుట్టూ ఇన్నర్ సెక్యూరిటీ కార్డన్ పేరుతో పన్నెండడుగుల ఎత్తులో భారీ ఇనుప కంచె నిర్మించారు. దీనికి సుమారు రూ. 5 కోట్లు దాకా ఖర్చు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులను క ట్టడి చేసేందుకు ఈ కంచె బాగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 30మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాని ప్రభావం తిరుమల బ్రహ్మోత్సవాలపై పడింది.

బ్రహ్మోత్సవాల్లో చిన్నపాటి ఘటన జరిగినా ఫలితాలు వేరుగా ఉంటాయని ప్రభుత్వ పెద్దల నుంచి టీటీడీకి ఆదేశాలందాయి. పనిలో పనిగా గ్యాలరీల్లోనూ చైన్‌లింక్ కంచెల సంఖ్య, వాటి ఎత్తు, నిడివిని కూడా ఎక్కడికక్కడ పెంచేశారు. ఇనుప కంచెలనుంచి భక్తులు లోనికి వెళ్లడానికి 10, రావడానికి  వాటి పక్కనే మరో 10 ద్వారాలు ఉన్నాయి. దీనివల్ల భక్తులు సులభంగా లోనికి వెళ్లలేరు. వెళ్లిన వారు పక్కకు కదిలే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే భక్తులు వెలుపలికి రావడానికి కష్టపడాల్సి వస్తుందనేది సీనియర్ అధికారులు భావన.
 
1.70 లక్షల మందికే గరుడ వాహన దర్శనం
బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనసేవకు జనం తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటారు. గతంలో ఇనుప కంచె నిర్మాణం లేకపోవడం వల్ల సుమారు 3 నుంచి 4 లక్షల మంది వరకు స్వామిని దర్శించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండు ఇనుప కంచెలు దాటుకుని లోనికి వెళ్లే పరిస్థితులు కనిపించటం లేదు. సాయంత్రం 4 గంటల్లోపు మాడ వీధుల్లోకి చేరిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. అది కూడా 1.70 లక్షల మందికి మాత్రమే దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత లోనికి వెళ్లే అవకాశం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement