
'రిజర్వేషన్ల విధానంపై సమీక్ష జరపాల్సిందే'
న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. యూపీలోని గోరఖ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారని 'దైనిక్ జాగరణ్' పత్రిక తెలిపింది. రిజర్వేషన్లకు భాగవత్ వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతమున్న విధానంలో లక్షిత వర్గాలకు లబ్ధి జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని భాగవత్ డిమాండ్ చేస్తున్నారని వెల్లడించింది.
కాగా, రిజర్వేషన్ల విధానంపై పునరాలోచన చేయాల్సిన అవసరం లేదని రెండు రోజుల క్రితం ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భాగవత్ డిమాండ్ పై రాజకీయంగా వివాదం తలెత్తడంతో బీజేపీ మౌనం దాల్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని పక్కన పెట్టింది.