సీఎం వద్దన్నా.. ర్యాలీకి సై
సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుకుందామని అనుకున్నా కుదరలేదు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని మరీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతా నగరం నడిబొడ్డున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోహన్ భగవత్ ఈ ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శతవిధాలా ప్రయత్నించారు. పశ్చిమబెంగాల్ పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు ఉన్న రామ్‌ధోను అనే పదాన్ని రొంగ్‌ధోనుగా మమత మార్పించారు. రామ్‌ధోను అనేది ఇంద్రధనుస్సుకు బెంగాలీ పదం. దాన్నే ఇప్పుడు ఆమె రొంగ్‌ధొనుగా మార్చారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సీఎం ఆదేశాలతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో.. ఆర్ఎస్ఎస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. భగవత్ సభకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో మమత ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ఇంతకుముందు కూడా అసన్‌సోల్ నగరంలో సంసద్ మేళా నిర్వహించాలని బీజేపీ భావించగా, అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ అందుకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు సైతం హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని బీజేపీ సభ నిర్వహించింది.