
ట్విట్టర్, అమెజాన్ పై గ్లోబల్ సైబర్ ఎటాక్
ప్రముఖ ఇంటర్నెట్ వ్యవస్థలను సెబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారనే వార్త తాజాగా కలకలం రేపుతోంది.
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ ఇంటర్నెట్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారనే వార్త తాజాగా కలకలం రేపుతోంది. ప్రముఖ ట్విట్టర్, అమెజాన్ సహా ఇంటర్నెట్ సేవలు అందించే ఇతర ముఖ్యమైన వెబ్సైట్లు సైబర్ దాడికి గురైనట్టు తెలుస్తోంది. గత రెండురోజులుగా వివిధ వెబ్ సైట్లు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్)దాడికి గురవుతున్నట్టు అమెరికాకు చెందిన ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రకటించింది. అలాగే డౌన్ డిటెక్టర్. కామ్ వెబ్ సైట్ అమెరికా, యూరప్ మీదుగా ఈ దాడి జరిగిందంటూ కొన్ని మ్యాప్ లను కూడా పోస్ట్ చేసింది. దీనిపై అమెరికా ఫెడరల్ బ్యూరోఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విచారణ మొదలు పెట్టింది.
మేజర్ ఇంటర్నెట్ దిగ్గజాల సేవలకు అంతరాయం ఏర్పడిందని ఇంటర్నెట్ సేవ సంస్థ డిన్ వెల్లడించింది. సుమారు రెండు గంటల్లో ఈ సేవలను పునరుద్ధరించినట్టు పేర్కొంది. అయినా తమ ఇంజనీర్లు ఈ సమస్య పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని చెప్పింది. ఈ దాడిని 'గ్లోబల్ డీడీఓఎస్ ఎటాక్' గా డిన్ కార్యనిర్వాహక ఉప ప్రెసిడెంట్ స్కాట్ హిల్టర్ అభివర్ణించారు. ముందుగా ఇంటర్నెట్ సేవల బ్యాక్ బోన్ గా పిలవబడే అమెరికా తూర్పు తీరంలో చాలా భాగం, టెక్సాస్ లో లెవల్ 3 కమ్యూనికేషన్స్ లో శుక్రవారం దాడి మొదలైందనీ, ఇది శనివారం కూడా కొనసాగి మిడ్వెస్ట్ , కాలిఫోర్నియా ప్రాంతాలకు వ్యాపించిందని వివరించారు. దాడుల సంక్లిష్టత తమకు పెద్ద సవాలుగా మారిందని డిన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ కైల్ యార్క్ చెప్పారు.
ఇది అందించిన సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, రెడ్ ఇట్ , ఇతర సాఫ్ట్ వేర్ డెవలపర్ సైట్ గిట్ హబ్ లు ఈ సైబర్ ఎటాక్ ప్రభావానికి లోనయినట్టు తెలుస్తోంది. దీని మూలంగా లక్షలకొద్దీ యూజర్లు ఇంటర్నెట్ సేవలను అందుకోలేక పోవడం, లేదా స్లో అవడం జరిగిందని వెల్లడించింది. ముఖ్యంగా సీఎన్ఎన్ , ది గార్డియన్, వైర్, హెచ్బీవో లాంటి మీడియా సంస్థలతో సహా మనీ ట్రాన్స్ ఫర్ సంస్థ పే పాల్ కూడా ఫిర్యాదులు అందాయని గిజమాడో వెబ్ సైట్ తెలిపింది.
మరోవైపు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ కూడా స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందనీ, అన్ని హానికరమైన కారణాలు పరిశోధిస్తున్నామని డీహెచ్స్(డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్సెక్యూరిటీ) ప్రతినిధి గిలియన్ క్రిస్టియన్ పేర్కొన్నారు.