
ఆకాశంలో ఉల్లి ధరలు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. నింగినంటిన ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. డిసెంబర్ వరకూ ఇలాగే ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ధరలు పెరుగుతూ కిలో రూ.100కు చేరుకునే ప్రమాదం ఉందంటున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉల్లి పంట సాధారణ విస్తీర్ణం 28 వేల హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు కేవలం 13,439 హెక్టార్లలోనే ఈ పంట సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 10 వేల హెక్టార్లలో పంట సాగువుతోంది. ఉల్లి సాగులో రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుండగా 40-60 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. కర్నూలు జిల్లాలో బావులు, బోర్ల కింద మూడు నెలల క్రితం సాగు చేసిన ఉల్లి 20 రోజులుగా మార్కెట్‌లోకి వస్తోంది.
మొత్తం దిగుబడి 12,50,000 క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తుండగా వ్యాపారులు రోజుకు 3000 క్వింటాళ్ల చొప్పున రైతులనుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ సీజన్ లో కర్నూలు జిల్లాలో ఉల్లి వ్యాపారం ప్రస్తుతం ఉన్న రైతుధరల ప్రకారం చూస్తే ఆరుకోట్ల రూపాయలు దాటుతోంది. దేశంలో ఉల్లి అత్యధికంగా పండే మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో ఇక్కడ పండిన ఉల్లిని కొనేందుకు వ్యాపారులు గ్రామాలకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర విభజన యోచన నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమ ప్రభావంతో మార్కెట్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో వ్యాపారులు నేరుగా రైతులవద్దకే వెళ్లి సరుకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలు ఉల్లి ధర కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.4,760 ఉండగా,తాడేపల్లిగూడెంలో రూ.4,900వరకు ఉంది. అయితే,వ్యాపారులు మాత్రం రూ.4,200 కంటే తక్కువకే రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఉల్లి క్వింటాల్ ధర రూ.7 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీలలో ఉల్లికి డిమాండ్ ఏర్పడటంతో రైతుల నుంచి దళారులు పోటీపడి సరుకును కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన ఉల్లి ధరలు అటు రైతుకు, ఇటు వ్యాపారులకు కాసులపంట పండిస్తున్నాయి.
నెల క్రితం క్వింటాలుకు రూ.1000 మాత్రమే ఉన్న ఉల్లి ధర నేడు రూ.4 వేలు దాటడంతో గతంలో ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్ర నష్టాలకు గురైన రైతులకు ఊరట లభిస్తోంది. అయితే, రైతుల నుంచి నేరుగా సరుకును కొనుగోలు చేసి, ప్రజలకు సరఫరా చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో సామాన్యుడి జేబు గుల్లవుతోంది. మార్కెటింగ్ సిబ్బంది సమైక్య సమ్మెలో పాల్గొంటున్న కారణంగా రైతుల నుంచి నేరుగా ఉల్లిని సేకరించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
నిండుకున్న నిల్వలు : దేశంలోని ప్రజల ఉల్లి అవసరాలను తీర్చడంలో మహా రాష్ట్ర రైతులదే అగ్రస్థానం. భారీవర్షాలతో మహారాష్ట్రలో ఉల్లి పంట తుడిచి పెట్టుకు పోయింది. ముందెన్నడూ లేని విధంగా డిమాండ్ పెరగడంతో ఏప్రిల్‌లోనే అక్కడ ఉల్లి నిల్వలు నిండుకున్నారుు. కర్ణాటకలోని హుబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉల్లి పంట అందుబాటులోకి రాకపోవడం ధరల పెరుగుదలకు మరో కారణం. మధ్యప్రదేశ్, ఇండోర్, రాజస్థాన్, గుజరాత్, పాట్నాలలో ఇంకా ఉల్లి పంట మార్కెట్లకు రాలేదు. ధార్వాడ, బెల్గాం, బీజాపూర్ వంటి ప్రాంతాల నుంచి సరుకు మార్కెట్లకు రావడం లేదు.ఢిల్లీ, పంజాబ్‌లలో డిమాండ్ పెరగడం ఉల్లి ధరల ఆకాశయానానికి దోహదం చేశాయి. డాలర్ ధర పెరగడం కూడా ఉల్లి ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది. దుబాయ్, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా దేశాలకు ఉల్లి ఎగుమతులు ఊపందుకోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కేరళ, తమిళనాడులలో దే శవాళీ రకాలైన తిరువూరు పాయలు, ఇతర నాటురకాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో స్థిరపడిన తమిళులు, కేరళీయుల అవసరాలను తీర్చడానికి ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు దళారుల కృత్రిమ కొరత కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.