కోటికి పైగా విలువైన పాతనోట్లు అపహరణ!
కోటికి పైగా విలువైన పాతనోట్లు అపహరణ!
Published Mon, Nov 21 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
ఒడిశా : ప్రభుత్వం ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాత కరెన్సీ నోట్లను తీసుకోవడానికే కాదు కనీసం చూడటానికే ఎవరూ మొగ్గుచూపడం లేదు. అలాంటిది ఓ బ్యాంకు నుంచి కోటికి పైగా పాత కరెన్సీ నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వీకెండ్ సెలవు అనంతరం ఒడిశా గ్రామ్య బ్యాంకు శాఖను తెరిచిన అధికారులు బ్యాంకులో నగదు దొంగతనానికి గురైనట్టు గుర్తించినట్టు దెంకనల్ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్పెస్టర్ అభినవ్ డాల్వ తెలిపారు. బ్యాంకులో మొత్తం రూ.8 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిలో రూ.1.15 కోట్లు కలిగిఉన్న ఒక ఐరన్ బాక్స్ మిస్ అయినట్టు గుర్తించినట్టు ఆయన చెప్పారు.
ఆ నగదంతా రద్దైన పాత కరెన్సీ నోట్లు రూ.500, రూ.1000లవేనని దెంకనల్ ఎస్పీ బసంత్ కుమాన్ పానిగ్రహి పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను తాము పరిశీలిస్తున్నామని, ఈ దొంగతనానికి బ్యాంకులోని వ్యక్తులే సహకరించినట్టు తాము అనుమానిస్తున్నట్టు చెప్పారు. రూ.7 కోట్ల కరెన్సీని మాత్రం ఓ పటిష్టమైన గదిలో దాచిఉంచడాన్ని చూసి తాము ఆశ్చర్యానికి గురయ్యామని పోలీసులు పేర్కొన్నారు. ఈ బ్యాంకు శాఖ దెంకనల్ టౌన్ పోలీసు స్టేషన్కు అడుగు దూరంలోనే ఉంటుందని, దొంగతనానికి పాల్పడిన నిందితుల కోసం స్పెషల్ టీమ్ తో వెతుకులాట ప్రారంభించినట్టు దెంకనల్ ఎస్పీ చెప్పారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా పాత నోట్లు డిపాజిట్ అవుతున్న సంగతి తెలిసిందే.
Advertisement