పాక్ నుంచి కసబ్ గ్యాంగ్ ఎలా వెళ్లింది..?
లాహోర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్ధావరాలపై భారత సైన్యం వ్యూహాత్మక దాడులు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత.. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటూ పాకిస్థాన్పై ప్రపంచ దేశాల ఒత్తిడి.. తదితర అంశాల నడుమ 26/11 ముంబై దాడుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకొనబోతోంది. విచారణను ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తోన్న పాక్.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలోనైనా ఈ కేసుకు సహేతుకమైన ముగింపు పలుకుతుందనే ఆశాభావం లేనప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ముంబై దాడుల విచారణ నిమిత్తం పాక్ (ఇస్లామాబాద్) యాంటీ టెర్రరిస్టు కోర్టు (ఏటీసీ) ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి న్యాయ కమిషన్ గురువారం (అక్టోబర్ 6న) కరాచీ పోర్టుకు వెళ్లనుంది.
లష్కరే తాయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ సహా 10 మంది కరాచీ పోర్టు నుంచి ముంబైకి వెళ్లేందుకు వినియోగించిన 'అల్ ఫౌజ్' బోటును న్యాయ కమిషన్ పరిశీలించనుంది. ఆ తర్వాత కసబ్ గ్యాంగ్ పాక్ నుంచి ముంబైకి ఎలా వెళ్లిందో తగిన సాక్ష్యాధారాలు జోడించి కోర్టుకు సమర్పించనుంది. కసబ్, అతని అనుచరులు కరాచీ పోర్టులో సంచరించినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను సైతం న్యాయ కమిషన్ ప్రశ్నించనుంది. ఉగ్రవాదులు వినయోగించిన మూడు బోట్లను అధికారులు కరాచీ షిప్ యార్డులో భద్రపర్చారు. ఏటీసీ కోర్టు జడ్జి నేతృత్వంలోని న్యాయ కమిషన్ లో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ), రక్షణ శాఖల అధికారులేకాక కొందరు న్యాయాధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.
కసబ్ గ్యాంగ్ ముంబైకి ఎలా వచ్చిందంటే..
పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రకారం.. (ముంబై దాడులకు సంబందించిన కొన్ని ఫొటోలు)ముంబైలో మారణహోమం సృష్టించాలనే లక్ష్యంతో 2006, నవంబర్ 23న లష్కరే తాయిబాకు చెందిన 10 మంది సుశిక్షిత ఉగ్రవాదులు ఏకే 47 రైఫిళ్లు, ఇతర మారణాయుధాలతో కరాచీ పోర్టు నుంచి మూడు బోట్ల ద్వారా భారత జలాల్లోకి ప్రవేశించారు(వీటిలో అల్ ఫౌజా అనే బోటును తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్నారు). మార్గం మధ్యలో చేపల వేటకు వినియోగించే మరో బోటును స్వాదీనం చేసుకుని, అందులోని నలుగురిని హతమార్చారు. బోటు నడిపే వ్యక్తిని బంధించి తమను ముంబై తీరానికి తీసుకెళ్లాల్సిందిగా బెదిరించారు. తీరా తీరాన్ని చేరాక ఆ వ్యక్తిని కూడా చంపేసి నవంబర్ 26నదక్షిణ ముంబైలోకి అడుగుపెట్టారు. మొత్తం ఎనిమిది చోట్ల విధ్వంసం సృస్టించిన ఉగ్రవాదులు 172 మందిని పొట్టనపెట్టుకున్నారు. మరో 300 మందిని గాయపర్చారు. ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే పోలీసులకు చిక్కగా, మిగతా తొమ్మిది మందిని ఎన్ఎస్ జీ కమాండోలు మట్టుపెట్టారు.
భారత్ సమర్పించిన ఆధారాలుతోపాటు అమెరికా,ఇతర అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు పాకిస్థాన్ ఎట్టకేలకు ముంబై దాడుల కేసు విచారణను ప్రారంభించింది. ముంబై దాడుల సూత్రధారి లష్కరే తాయిబా ఆపరేషన్స్ చీఫ్ జకీఉర్ రహమాన్ లఖ్వీ తోపాటు మరో ఆరుగురిని నిందితులుగా చేర్చి, అరెస్టు చేసింది. కాగా లఖ్వీ మాత్రం కొద్దిరోజులకే బెయిల్ పై విడుదలయ్యాడు. మళ్లీ అరెస్టయ్యి గత ఏడాది జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండాపోయాడు. ప్రస్తుతం లఖ్వీ గుర్తుతెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నాడని సమాచారం. ఎనిమిదేళ్లుగా సాగుతోన్న విచారణలో ప్రాసిక్యూషన్ పలు నివేదికలను సమర్పిస్తున్నప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేనందున పాక్ కోర్టులు వాటిని కొట్టిపారేస్తూనేఉన్నాయి. ఈ బోటు పరిశీలన కూడా అలాంటిదే అవుతుందా లేదా వేచిచూడాలి.