న్యూఢిల్లీ: యూరియా స్థిర వ్యయాన్ని టన్నుకు రూ.350 పెంచేందుకు కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) సిఫారసు చేసింది. ఈ సిఫారసును కేంద్రమంత్రివర్గం అంగీకరిస్తే.. పెంపు తరువాత టన్ను యూరియా కనీస స్థిరవ్యయం రూ. 2300 కానుంది. అయితే, పెరిగిన ధరను సబ్సీడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది, రైతులపై ఆ భారం పడదు. తాజా పెంపు ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రభుత్వంపై యూరియా సబ్సీడీ భారం రూ. 900 కోట్ల మేర పెరగనుంది.
30 ఏళ్ల పైబడిన సంస్థలు ఉత్పత్తి చేస్తున్న యూరియాకు టన్నుకు రూ. 150, మిగతా అన్ని సంస్థలకు రూ. 350 పెంపును వర్తింపజేయాలని సంబంధిత జీఓఎం సిఫారసు చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి శ్రీకాంత్ జెన గురువారం వెల్లడించారు. యూరియా స్థిర వ్యయాన్ని నిర్ణయించేందుకు ఆధారమైన మూల సంవత్సరాన్ని కూడా 2002-03 నుంచి 2008-09కి మార్చారు. అయితే ఎరువుల కంపెనీలు మాత్రం స్థిరవ్యయాన్ని టన్నుకు రూ. 700 పెంచాలని, మూల సంవత్సరాన్ని 2011-12 చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు, కూలీల ఖర్చు, కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలు మరమ్మతు, నిర్వహణ ఖర్చు, అమ్మకం ఖర్చులు.. వీటి మొత్తం ఆధారంగా యూరియా ప్లాంట్లలో స్థిర వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఎరువుల సబ్సిడీల కింద రూ. 70585 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది. భారత్ ఏటా 22 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. మరో 8 టన్నులను దిగుమతి చేసుకుంటోంది.
యూరియా స్థిర వ్యయం పెంపు!
Published Fri, Jan 31 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement