
పన్నీర్ వర్సెస్ పళని
శశికళను దోషిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వడంతో తమిళ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. తన ఆశలపై సర్వోన్నత న్యాయస్థానం నీళ్లు చల్లడంతో పళనిస్వామిని శశికళ తెరపైకి తెచ్చారు. తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు పోటీగా పళనిస్వామిని నిలిపారు. ఇప్పటివరకు సీఎం పీఠం కోసం శశికళ, సెల్వం మధ్య జరిగిన పోరు ఇప్పుడు పన్నీర్ వర్సెస్ పళనిగా మారింది.
తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్న పన్నీర్ సెల్వంను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన ‘చిన్నమ్మ’... వెంటనే పళనిస్వామిని శాసనసభా పక్ష నేతగా ఎన్నికయేలా చేశారు. తనకు అడ్డుపడిన సెల్వంకు సీఎంగా మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో శశికళ పావులు కదుపుతున్నారు. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలు ఏకగ్రీంగా తనను నాయకుడిగా ఎన్నుకున్నారని పళని ప్రకటించారు. అంతేకాదు పార్టీతో పన్నీర్ కు ఇక ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం స్వరం మార్చారు. విభేదాలు మర్చిపోయి, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ చీలిపోకుండా చూసుకుందామంటూ బుజ్జగింపులకు దిగారు. మరోవైపు పళనిస్వామికి మార్గం సుగమం చేసేందుకు శశి వర్గం ప్రయత్నిస్తోంది. గవర్నర్ తో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమయింది. పన్నీర్, పళని పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.