పరాటా మేకర్.. అయ్యాడు సూపర్ క్రికెటర్!
పేదరికంలో పుట్టిన అతను.. ఓ హోటల్‌లో పరాటాలు చేసేవాడిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. హోటల్ వాళ్లిచ్చే జీతం డబ్బుతోనే క్రికెట్ కిట్ కొనుక్కున్నాడు. తీరిక దొరికిందే తడవుగా కఠోర ప్రాక్టీస్ చేసేవాడు. తొలుత జిల్లాస్థాయిలో ప్రతిభకనబర్చిన అతను.. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ జట్టుకు ఎంపికయ్యాడు. అతిత్వరలోనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. పేరు హనన్ ఖాన్. ఊరు ఛామన్. పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతమైన క్వెట్టా ఫ్రావిన్స్‌లో ఉందా ఊరు!
క్రికెట్ ఆడే మిగతా దేశాలకంటే పాకిస్థాన్ జాతీయ జట్టులోకి కొత్తగా ఎంపికయ్యే ఆటగాళ్లలో చాలా మంది కడుపేదలు, కష్టపడి పైకిచ్చినవాళ్లే ఉంటారు. అబ్దుల్ రజాక్, యూసఫ్ యొహానా, మొహమ్మద్ ఇర్ఫాన్ లాంటి వాళ్లెందరో అందుకు ఉదాహరణ. హనన్ ఖాన్ విషయానికి వస్తే.. బలూచిస్థాన్‌కు చెందిన ఈ యువకుడు స్థానిక రెస్టారెంట్లో పరాటా మేకర్‌గా పనిచేస్తూ క్రికెట్ ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్‌గా అతని ప్రతిభ గురించి తెలుసుకున్న క్రికెట్ పెద్దలు క్వెట్టా డొమెస్టిక్ గ్రేడ్-2 మ్యాచ్‌లో అవకాశం కల్పించారు. అక్కడ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఎంపికై పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడాడు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
జనవరి 14 నుంచి పాక్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ), మలేసియా జట్ల మధ్య లాహోర్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లోగానీ హనన్ ఖాన్ మెరిస్తేగనుక, నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ‘ఎన్‌సీఏ జట్టులోకి ఎంపిక చేసినందుకు క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అంతా అల్లా దయ. ఎప్పటికైనా జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల’అంటాడు సూపర్ క్రికెటర్‌గా ఎదిన పరాటా మేకర్ హనన్ ఖాన్.