కొత్త కంపెనీల బిల్లుకు ఆమోదముద్ర | Parliament passes Companies Bill | Sakshi
Sakshi News home page

కొత్త కంపెనీల బిల్లుకు ఆమోదముద్ర

Published Fri, Aug 9 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

కొత్త కంపెనీల బిల్లుకు ఆమోదముద్ర

కొత్త కంపెనీల బిల్లుకు ఆమోదముద్ర

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీల్లో వాటాదారులకు... కంపెనీల మోసాల్ని దర్యాప్తు చేసే సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించటం... కంపెనీల బాధ్యతను పెంచటం వంటి ప్రధానాంశాలతో కూడిన కొత్త కంపెనీల బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. గురువారం దీన్ని రాజ్యసభ ఆమోదించటంతో... 56 ఏళ్లుగా అమల్లో ఉన్న కంపెనీల చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. డిసెంబర్లోనే దీనికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. కార్పొరేట్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ కంపెనీల పనితీరు మరింత పారదర్శకంగా ఉండేలా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశీయ కార్పొరేట్ రంగాన్ని తీర్చిదిద్దడానికి దోహదం చేస్తుందంటున్న ఈ ‘కంపెనీల బిల్లు-2012’లో ముఖ్యాంశాలివీ... 
 
 చిన్న మదుపరికి విశేషాధికారాలు...
  చిన్న మదుపరులకు రక్షణగా... కంపెనీలు సేకరించిన నిధులను ఉద్దేశించిన లక్ష్యానికి కాకుండా వేరే వాటికి ఉపయోగిస్తే వాటాదారులు ఆ కంపెనీ నుంచి వైదొలిగే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది. వాటాదారులకు వారి షేర్లు విక్రయించుకొని బయటపడే మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా ప్రమోటర్లదే. 
  సేకరించిన నిధుల్ని కంపెనీలు కనక వ్యాపార విస్తరణకు వినియోగించాలనుకుంటే తొలుత అందుకు బోర్డు ఆమోదాన్ని తీసుకోవాలి. 
 
 తరవాత పత్రికా ప్రకటనల ద్వారా వాటాదారులకు తెలియజేయాలి. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లకు నచ్చకుంటే వారికి కంపెనీ నుంచి వైదొలిగే అవకాశాన్ని కల్పించాలి.  అలా వైదొలగడానికి అనుసరించాల్సిన విధివిధానాలను ‘సెబీ’ నిర్దేశించాలి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం చిన్న ఇన్వెస్టర్ల కంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌చేసే ఎఫ్‌ఐఐలు, దేశీయ ఫండ్స్ లేదా సంపన్న ఇన్వెస్టర్లకే లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  కంపెనీలు తమ వాటాను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ చేస్తే ఆ వివరాలను కంపెనీలు విధిగా 30 రోజుల్లోపు రిజిస్ట్రార్లకు తెలపాలి.
 
  కావాల్సిన వారికి తక్కువ రేటుకు షేర్ల కేటాయింపు కుదరదు. 
  వరుసగా మూడేళ్ల సగటు డివిడెండును మించి ఏ కంపెనీ కూడా మధ్యతర డివిడెండ్ ప్రకటించకూడదు. 
  ప్రైవేటు కంపెనీల్లో గరిష్టంగా ఉండాల్సిన సభ్యుల సంఖ్యను 50 నుంచి 200కి పెంచుతూ కొత్త చట్టంలో మార్పులు చేశారు.
 
  కార్పొరేట్ కుంభకోణాల్ని విచారించే  సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐవో)కు కొత్త చట్టం మరిన్ని అధికారాలిస్తోంది. కుంభకోణాలకు పాల్పడ్డ వారి  అరెస్టు, వారి ఆస్తుల జప్తు వంటి అధికారాలు ఎస్‌ఎఫ్‌ఐఓకు ఉంటాయి. కుంభకోణంపై ఎస్‌ఎఫ్‌ఐవో చేత దర్యాప్తు చేయించే అధికారం మాత్రం కేంద్రానిదే. అయితే ఒకసారి ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు ప్రారంభిస్తే ఇతర విచారణ సంస్థలు దీన్లో జోక్యం చేసుకునే వీలుండదని బిల్లు స్పష్టం చేస్తోంది. 
 
  ఏదైనా కంపెనీ అక్రమాలు, కుంభకోణాల వల్ల ఇన్వెస్టర్లు మోసపోతే.. వారంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి సదరు సంస్థపై దావా వేయొచ్చు. సమష్టిగా పోరాడి పరిహారం సాధించుకునేందుకు వీలుగా క్లాస్ యాక్షన్ దావా అమల్లోకి రానుంది. కంపెనీ ఆడిటర్లు మొదలుకొని సంస్థకు సలహాలిచ్చే కన్సల్టెంట్ల దాకా ఎవరిపైనైనా సరే క్లాస్ యాక్షన్ దావాలు వేయొచ్చు. వీటి విచారణకు ‘‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్’’ కూడా ఏర్పాటు కానుంది. 
 
  కంపెనీ విలువను మదింపు చేయడంలో పారదర్శకత తేవటానికి కొత్త చట్టంలో రిజిస్టర్డ్ వాల్యుయర్ అనే అంశాన్ని చేర్చారు. ఇకపై రిజిస్టర్డ్ వాల్యుయర్ మాత్రమే కంపెనీ విలువను మదించాలి. ఈ వాల్యుయర్‌ని ఆడిట్ కమిటీ నియమించాలి. ఆడిట్ కమిటీ లేకుంటే బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు నియమించొచ్చు. 
  ‘కీ మేనేజరియల్ పర్సన్’ (కంపెనీ నిర్వహణలోని కీలక వ్యక్తి) అన్న పదానికి స్పష్టమైన నిర్వచనాన్నిచ్చారు. సీఈవో, ఎండీలతో పాటు కంపెనీ సెక్రటరీ, హోల్‌టైమ్ డెరైక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లకు ‘కీ మేనేజరియల్ పర్సన్’ హోదా ఇచ్చారు.
 
 ఆడిటర్లకు ఐదేళ్ల కాలపరిమితి...
 ఆడిటింగ్ కుంభకోణాలను నిరోధించడానికి కఠిన నిబంధనలు చేరుస్తూ పలు మార్పులు చేశారు. కంపెనీలు వ్యక్తిగత ఆడిటర్‌ను గరిష్టంగా ఐదే ళ్లు నియమించుకోవచ్చు. ఇలా ఒక కంపెనీకి వరుసగా రెండు విడతలకు మించి పనిచేయడానికి వీల్లేదు. అంటే ఒక ఆడిటింగ్ సంస్థ ఒక కంపెనీలో గరిష్టంగా పదేళ్లు మాత్రమే పనిచేయగలుగుతుంది. అంతేకాదు! ఏక కాలంలో ఒక ఆడిటర్ 20 కంపెనీలకు మించి పనిచేయకూడదు. ఈ మార్పుల వల్ల ఆడిటర్ల బాధ్యతలు పెరగడమే కాక ఆడిటింగ్ సంస్థలకు డిమాండ్ కూడా పెరుగుతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ దయాకర్ జెల్లి అభిప్రాయపడ్డారు. 
 
 ఏక వ్యక్తి కంపెనీలకు ఓకే...
 దేశంలో తొలిసారిగా వన్ పర్సన్ కంపెనీల (ఓపీసీ) ఏర్పాటుకు కొత్త చట్టం అవకాశమిస్తోంది. ఎవరైనా కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటే కో-ఫౌండర్‌ను వెతుక్కునే సమస్య తప్పుతుంది. అయితే ఇలాంటి కంపెనీల పేర్ల చివర ఓపీసీ అని పేర్కొనాలి. ఒక్కరిగా పనిచేసే ఫ్రీలాన్సర్లు, డిజైనర్లు, టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్లు, డెవలపర్లకు ఇది లాభించనుంది. 
 
 మహిళా డెరైక్టర్లు తప్పనిసరి...
 కంపెనీల బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు, వారికిచ్చే జీతభత్యాల విషయంలో పలు మార్పుల్ని కొత్త చట్టం నిర్దేశించింది. లిస్టెడ్ కంపెనీల బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా ప్రతినిధి ఉండాలి. అంతేకాక మొత్తం డెరైక్టర్లలో కచ్చితంగా మూడోవంతు స్వతంత్ర డెరైక్టర్లుండాలి. చిన్న షేర్ హోల్డర్లకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించేలా తప్పనిసరిగా ఒక స్వతంత్ర డెరైక్టర్ ఉండాలి. మూడేళ్ల పదవీ కాలంతో వీరిని వరుసగా రెండుసార్లు నియమించవచ్చు. ఆ పైన నియమించాలంటే మాత్రం కంపెనీ ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది.
 
 లాభాల్లో 2 % సమాజ సేవకు...
 కార్పొరేట్ సామాజిక బాధ్యతను (సీఎస్‌ఆర్) కంపెనీలు తప్పనిసరిగా నిర్వర్తించాలి. కంపెనీలు విధిగా తమ మూడేళ్ల నికర లాభాల్లో కనీసం 2 శాతాన్ని సీఎస్‌ఆర్‌కి కేటాయించాలి. నెట్‌వర్త్ రూ.500 కోట్లు మించినా.. టర్నోవర్ రూ.1,000 కోట్లు దాటినా... నికరలాభం రూ.5 కోట్లను మించినా సీఎస్‌ఆర్ కమిటీని ఏర్పాటు చేయాలి. దీన్లో ముగ్గురు లేదా అంతకు మించి డెరైక్టర్లు (మళ్లీ అందులో ఒక స్వతంత్ర డెరైక్టరు) ఉండాలి. ఒకవేళ సీఎస్‌ఆర్ వ్యయాలలో విఫలమైతే అందుకు కారణాలను వివరిం చాలి. ఈ వ్యవహారాల్ని పర్యవేక్షించాల్సింది కంపెనీ సెక్రటరీలే కాబట్టి వారి ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ షుజాత్ బిన్ అలీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement