ఊహించినట్లుగానే వాడివేడిగా..
న్యూఢిల్లీ : అంతా ఊహించినట్లుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. లలిత్ 'మోదీ గేట్' తొలి రోజే పార్లమెంట్‌ను కుదిపేసింది. రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం చెలరేగింది. దాంతో విపక్షాల నిరసనల మధ్య సభ పన్నెండు గంటలకు వాయిదా పడింది. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు లలిత్ మోదీ వీసా వివాదాన్ని లేవనెత్తాయి.
ఈ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అధికారపక్షంపై ఎదురుదాడికి దిగారు. లలిత్ వీసా విషయంలో విదేశాంగ నియమాలు యథేచ్చగా ఉల్లంఘించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. లలిత్ గేట్‌పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు.
లలిత్ మోదీ వీసా వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వైస్ ఛైర్మన్ కురియన్ ...అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ్యులు తమ ఆందోళన విరమించి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించినా ఫలితం లేకపోయింది. సభ్యుల నిరసనలు, నినాదాలతో కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో ఆయన సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
కాగా అంతకుముందు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన బీజేపీ నేత ఎంజే అక్బర్‌తో ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన భారతీయులను సభ అభినందనల్లో ముంచెత్తింది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో బృందంపై ప్రశంసలు కురిపించిన సభ వింబుల్డన్ టైటిల్ గెలిచిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, లియాండర్ పేస్‌కు అభినందనలు తెలిపింది.
మరోవైపు మొదటి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టకుండానే లోక్ సభ వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభమైన తర్వాత...... ఇటీవల మృతి చెందిన పార్లమెంట్ సభ్యులకు సభ నివాళి అర్పించింది. దివంగత సభ్యుల ఆత్మలకు శాంతి చేకూరాలంటూ... రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత వరంగల్ ఎంపీ పదవికి టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.