ముషారఫ్పై బాంబు దాడి
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్పై బాంబుదాడి జరిగింది. ఈ హత్యాయత్నం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్లామాబాద్ శివార్లలో ఆయన ఉంటున్న సైనిక ఆస్పత్రి నుంచి కోర్టుకు వచ్చే మార్గంలో బాంబు పెట్టారు. ఆయన వచ్చే మార్గంలో ఓ వంతెన కింద ఉన్న పైపులైనులో నాలుగు కిలోల పేలుడు పదార్థాలను అమర్చారని, సరిగ్గా మరో 20 నిమిషాల్లో ముషారఫ్ అటువైపుగా వెళ్లాల్సి ఉందనగా బాంబు పేలిందని పోలీసులు తెలిపారు.
రాజద్రోహం కేసులో ముషారఫ్ను ఓ పాకిస్థానీ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేరానికి గరిష్ఠంగా మరణశిక్ష పడే అవకాశం ఉంది. కానీ, ముషారఫ్ ప్రాణాలకు ముప్పు ఉండటం, ఆయనపై పదే పదే దాడులు జరుగుతుండటంతో అసలు విచారణ జరుగుతుందా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. అనారోగ్యం, భద్రతాపరమైన ముప్పుతో ముషారఫ్ చాలాసార్లు విచారణకు హాజరు కాలేదు. దాదాపు రెండువేల మంది భద్రతా సిబ్బంది వెంటరాగా, భారీ కాన్వాయ్తో సోమవారం నాడు ముషారఫ్ కోర్టుకు వచ్చారు. 1999లో అధికారాన్ని చేజిక్కించుకుని, 2008లో పదవీచ్యుతుడైన ముషారఫ్.. తాను ఎలాంటి తప్పు చేయలేదనే ఇప్పటికీ అంటున్నారు.