నేడో రేపో రెండు పీసీసీలు: దిగ్విజయ్ | PCC Likely to Split into Two to control Telangana and Seemandhra | Sakshi
Sakshi News home page

నేడో రేపో రెండు పీసీసీలు: దిగ్విజయ్

Published Sun, Mar 9 2014 6:20 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

నేడో రేపో రెండు పీసీసీలు: దిగ్విజయ్ - Sakshi

నేడో రేపో రెండు పీసీసీలు: దిగ్విజయ్

ఎన్నికల కమిటీలు, మేనిఫెస్టో కమిటీలు కూడా: దిగ్విజయ్
 సాక్షి, న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో సీమాంధ్రకు, తెలంగాణకు ప్రత్యేక పీసీసీలు ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుతో పాటు ఎన్నికల కమిటీలు, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటు కూడా పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ‘‘రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నందున.. ఈలోగా రెండు పీసీసీలు ఏర్పాటు చేస్తే.. పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలను ఏ పీసీసీ అధ్యక్షుడు ఇస్తారు?’ అని ప్రశ్నించగా.. దీనిపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని.. ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బదులిచ్చారు. దిగ్విజయ్ శ నివారం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలివీ...
 
 ప్రశ్న: కిరణ్ పార్టీ ఏర్పాటుచేశారు. దీనిపై ఏమంటారు?
 దిగ్విజయ్: వినడానికి బాధగా ఉంది. ఎందుకంటే కిరణ్‌రెడ్డి  ఎన్నటికీ పార్టీని వీడనని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టబోనని వాగ్దానం చేశారు. మొన్న (గురువారం) ఉదయం కూడా చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టబోనన్నారు. ఇది దురదృష్టకరం. ఆయన కాంగ్రెస్‌లో ఉంటే సంతోషించేవాళ్లం. కానీ ఆయన స్పష్టంగా పార్టీపై ప్రకటన చేశారు. నేను అభినందిస్తున్నా. కానీ ఆయన మరో రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడం ద్వారా.. కాంగ్రెస్‌ను సైద్ధాంతికంగా వ్యతిరేకించే పార్టీలకు ఆయన సహాయకారిగా మారారు.
  టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందా?
 ఇంకా చర్చలు జరగలేదు. నేను కేశవరావుతో టచ్‌లో ఉన్నాను. ఆయన సోమవారం ఢిల్లీ రావాల్సి ఉంది.
 టీ కాంగ్రెస్ నేతలు.. టీఆర్‌ఎస్ విలీనం వద్దంటున్నారు కదా?
 అనేకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మా నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
 సీమాంధ్రకు చెందిన మంత్రులు పార్టీని విడిచిపోతున్నారు. పురందేశ్వరి బీజేపీ, గల్లా టీడీపీ...  వాళ్లు ఏ పార్టీలో చేరటానికైనా వారికి స్వేచ్ఛ ఉంది. విభజన విషయంలో వాళ్లు తమ అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పకుండా ఎప్పుడూ నిరోధించలేదు.  కాంగ్రెస్ అవమానించిందని పురందేశ్వరి అంటున్నారు..
 మంత్రి పదవి ఇవ్వటమేనా మేం చేసిన తప్పు?
 విశాఖపట్నం లోక్‌సభ సీటు గురించి...
 అది తప్పు. నేనేం అడిగానంటే.. ‘అక్కడి ప్రజలు మిమ్మల్ని వేరే నియోజకవర్గానికి మారమంటున్నారు.. మారటం మీకు ఇష్టమేనా?’ అని నేను ఆమెను అడిగాను. కానీ ఆమె విశాఖ నుంచే పోటీ చేస్తానన్నారు. అందుకు నేను సరేనన్నా.
 చిరంజీవి తమ్ముడు పవన్ పార్టీ పెడుతున్నారట?
 స్వాగతిస్తాం. కాంగ్రెస్‌లో చేరతానంటే ఇంకా సంతోషిస్తాం.
 పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా?
 ఇది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది కరమే. ఎందుకంటే 9 విడతల్లో పాల్గొనాల్సిన యంత్రాంగమే వీటికి కూడా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండూ ఒకేసారి నిర్వహించగలరో లేదో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
 తెలంగాణలో కానీ, సీమాంధ్రంలో కానీ మీ పార్టీ నేతలు ఎందుకు ప్రచారానికి రావటం లేదు?
 పీసీసీలు ఏర్పాటైన వెంటనే మా పార్టీ అగ్రనేతలు రెండు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
 ఎంఐఎంతో మీకు అవగాహన ఉంటుందా?
 ఎంఐఎం యూపీఏకు మద్దతు ఇచ్చింది. కానీ వాళ్లు చెప్పిన ప్రతిదానికీ మేం అంగీకరించలేం.
 సీమాంధ్రకు రాజధానిగా ఏ నగరం ఉండాలని మీ వ్యక్తిగత అభిప్రాయం?
 నేనెందుకు సైడ్ తీసుకోవాలి? నేనేం సీమాంధ్రలో భూములు కొనలేదు.
 సీమాంధ్రలో పార్టీ పునరుద్ధరణ జరుగుతుందా?
 మీరు చూస్తారు.
 
 టీ నేతల ఆఖరి ప్రయత్నం!
 సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆఖరి ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలో మకాం వేసి టీపీసీసీ పీఠం దక్కేలా లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జానారెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ పేర్లతో కాంగ్రెస్ అధిష్టానం జాబితా రూపొందించినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఏపీసీసీ, టీపీసీసీ అధ్యక్ష పదవులతోపాటు మేనిఫెస్టో, ఎన్నికల ప్రచార కమిటీలను కూడా ఆదివారం ప్రకటించేందుకు హైకమాండ్ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దామోదర రాజనర్సింహ , డి.శ్రీనివాస్, మర్రి శశిధర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.ఆర్.సురేష్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరులు శనివారం ఉదయం హస్తినకు వెళ్లారు.
 
  రాహుల్‌గాంధీని కలిశారు. సీమాంధ్రలో పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చామనే విషయాన్ని గుర్తుంచుకుని పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయపథంలో నడిపించేందుకు నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని రాహుల్ వారికి హితబోధ చేసినట్లు తెలిసింది. అనంతరం ఆయా నేతలతోపాటు మల్లు రవి తదితరులు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, టీఆర్‌ఎస్‌తో పొత్తు, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన అంశాలపై అభిప్రాయాలను తెలియజేశారు. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్ష పదవికి తమ పేర్లను పరిశీలించాలంటూ ఎవరికి వారే వినతి పత్రం అందజేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement