బ్యాంకులపై ప్రజల దాడులు
నగదు కష్టాలు తీవ్రతరమవుతుండటంతో అసహనానికి గురవుతున్న సాధారణ ప్రజానీకం బ్యాంకు శాఖలపై దాడికి కూడా పాల్పడుతున్నారు. నగదు అందించలేని బ్యాంకుల వద్ద నిరసనలకు దిగుతున్నారు. హైదరాబాద్లోని టోలిచౌక ప్రాంతంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమకు అవసరమైన నగదును అందించడంలో విఫలమైనందుకు నిరసనగా.. ప్రజలు రోడ్డును బ్లాక్ చేశారు. బస్సులను నిలిపివేశారు. ఇటు ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గురుద్వారా ట్రాహాలోని ఓ కోఅపరేటివ్ బ్యాంకు తమ కస్టమర్లకు సరిపడ నగదు అందించలేదని తెలుసుకున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) సభ్యులు ఆ బ్యాంకు వద్దనున్న రోడ్డును బ్లాక్ చేశారు. బ్యాంకు తలుపును కూడా బీకేయూ సభ్యులు నిన్న సాయంత్రం నుంచి లాక్ చేసి ఉంచారు.
అదేవిధంగా తనభావాన్లోని ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ వద్ద కస్టమర్లు నిరసనకు దిగడంతో ఆ శాఖ కూడా మూతపడింది. మొరాబాద్ స్టేట్ బ్యాంకుపై ఏకంగా స్థానికులు దాడిచేశారు. నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఆగ్రహానికి లోనైన వారు ఈ దాడికి పాల్పడ్డారు. ఇదేమాదిరి ఘటనలు పలు బ్యాంకు శాఖల వద్ద చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులు సహనంతో వేచిచూసిన ప్రజానీకం, కరెన్సీ లేని కష్టాలు తీవ్రతరమవుతుండటంతో ఆగ్రహానికి లోనవుతున్నారు. బ్యాంకుల వద్ద ఎన్నిరోజులు నిల్చున్నా పరిస్థితి మారకపోతుండటంతో అక్కడే నిరసనలకు దిగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఆర్బీఐ మాత్రం తమ వద్ద ప్రజలకు అవసరమైన నగదు ఉందంటూ పలు ప్రకటనలు గుప్పిస్తోంది. బ్యాంకుల వద్ద జరుగుతున్న ఈ ఘటనలతో బ్యాంకుల బయట సెక్యురిటీని ప్రభుత్వం భారీగా పెంచుతోంది.