మళ్లీ నగదు దిశగా సీన్ రివర్స్
ముంబై: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన రెండు నెలల్లోనే, అంటే ఈ ఏడాది జనవరి నాటికల్లా మహారాష్ట్రలోని థానె జిల్లా, ధసాయ్ గ్రామం నూటికి నూరుపాళ్లు నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. దేశంలోనే రెండవ, మహారాష్ట్రలో మొట్టమొదటి నూటికి నూరుపాళ్ల డిజిటల్ గ్రామంగా దేశంలోని పత్రికలన్నీ కోడై కూశాయి. ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
గ్రామంలో 20 శాతం మంది కూడా నగదురహిత లావాదేవీలు నిర్వహించడం లేదు. 80 శాతం మందికిపైగా మళ్లీ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్నారు. అసలు గ్రామంలో పనిచేస్తున్న డిజిటల్ లావాదేవీల మషిన్లే 25 శాతానికి మించి లేవు. మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం కోసం ధసాయ్ గ్రామంలో మధ్యలోవున్న హార్డ్‌వేర్, స్టేషనరీ షాపులోకి మీడియా ప్రతినిధులు వెళ్లగా, షాపు యజమాని ప్రవీణ్ గోలప్ ఏం కావాలని అని ప్రశ్నించారు. కార్డ్ స్వైపింగ్ మషిన్ లేదా అని ప్రశ్నించగా, ఉందిగానీ పని చేయడం లేదని చెప్పారు. ఏది ఒక్కసారి చూపించండి అడగ్గా, అది ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఆయనకు, ఆయన సహాయకుడికి 45 నిమిషాలు పట్టింది. చివరకు బాణాసంచా బాక్సుల వెనక వారికి ఆ మషిన్ దొరికింది.
తానూ ఈ మషన్‌ను గత డిసెంబర్ నెలలోనే తీసుకున్నానని, ఫిబ్రవరి నెల వరకు బాగానే పనిచేసిందని, ఆ తర్వాత పనిచేయడం మానేసిందని చెప్పారు. వినియోగదారులందరు నగదు చెల్లింపులకే ఇష్టపడుతుండడంతో తాము కూడా స్వైపింగ్ మషన్‌ను మరమ్మతు చేయించాలనుకోలేదని, అందుకనే మూలకు పడేశామని చెప్పారు. నగరంలోని షాపుల్లో 20 శాతానికి మించి స్వైపింగ్ మషిన్లు పనిచేయడం లేదని తెలిపారు.
మరో స్టీలు షాపునకు వెళ్లగా, పేటిఎం ద్వారా లావాదేవీలు నిర్వహిస్వూ వచ్చామని, ఇప్పుడు వినియోగదారులు నగదు చెల్లింపులే కోరుకుంటున్నారని చెప్పారు. అసలు తమ దుకాణాలకు వచ్చే వినియోగదారుల వద్దనే 25 శాతానికి మించి క్రెడిట్ కార్డులు ఉండవని, ఉన్నవారు కూడా ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం సక్రమంగా లేకపోవడం వల్ల ఎవరూ ఉపయోగించడం లేదని ఆయన చెప్పారు. స్టేషనరీ షాపుల నుంచి బ్యూటీ పార్లర్ల వరకు ఇప్పుడు అందరూ మళ్లీ నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. వినియోగదారులందరి వద్ద డిబెట్ కార్డులు లేకపోవడం, ఉన్నవారు కూడా యూజర్ చార్జీలకు భయపడడం, నెటవర్క్ సమస్యలు నగదు లావాదేవీలకు కారణమని షాపుల యజమానులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రజలెవరూ కూడా బ్యాంకులకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాలని కోరుకోవడం లేదని వారన్నారు. ఏటీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం, బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకోవాలా? అన్న ఇబ్బందితో వారు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి ఇష్టపడడం లేదు.
ధసాయ్ షహర్ వ్యాపారి అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా, ప్రతి వంద మంది వ్యాపారుల్లో 70 మంది వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు తీసుకున్నారని, ఇప్పుడు వారిలో 25 శాతానికి మించి వాడడం లేదని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఉచితంగా స్వైపింగ్ మషన్లను ఇవ్వడంతో అప్పుడు ఎక్కువ మంది తీసుకున్నారని తెలిపారు. మరో నలుగురు చిన్న వ్యాపారులను ప్రశ్నించగా వారు ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నగదు లావా దేవీలే నిర్వహిస్తున్నామని, తామెన్నడూ డిజిటల్ లావా దేవీలు నిర్వహించలేదని చెప్పారు.