పాట్నా : భారతీయ జవాన్లపై జేడీయూ పంచాయతీ శాఖ మంత్రి భీమ్సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారంటూ ఆయన గురువారమిక్కడ నోరు జారటంతో దుమారం రేగింది. మరణించిన వీర జవాన్ల అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు భీమ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన మంత్రి భీమ్ సింగ్ను ఆదేశించారు. కాగా భీమ్సింగ్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. భీమ్సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. జవాన్లను కించపరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.
కాగా పాకిస్తాన్ జరిపిన అమానుష దాడిలో అయిదుగురు భారతీయ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు భారతీయ జవాన్ల హత్యపై తాను ఇచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ గురువారం లోక్సభలో మరోసారి వివరణ ఇచ్చారు. దాడిలో మిలిటెంట్లు కూడా పాల్గొన్నట్లు తాను చేసిన ప్రకటనను ఆయన సమర్థించుకుంటూ అప్పటికి తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ప్రకటన చేసినట్లు చెప్పారు.
'చావడానికే ప్రజలు ఆర్మీలో చేరతారు'
Published Thu, Aug 8 2013 2:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement