అక్కడ లీటరు పెట్రోలు రూ. 190!
ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలంటూ మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఆందోళన అక్కడి ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇంఫాల్- డిమాపూర్, ఇంఫాల్ - సిల్చార్ జాతీయ రహదారులు మూసుకుపోవడంతో రాష్ట్రంలోకి సరుకులు వచ్చే మార్గం లేకుండా పోయింది. దీంతో రాజధాని ఇంఫాల్ నగరంలో పెట్రోలు ధర దాదాపు రూ. 190 వరకు చేరుకుంది. అలాగే ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.
ఇంఫాల్- డిమాపూర్ జాతీయ రహదారిలో ఆగస్టు మధ్యవారంలో భారీ కొండ చరియ విరిగిపడింది. దాంతో అక్కడి రోడ్డు మార్గం మొత్తం మూసుకుపోయింది. మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాలేదు. దానికి తోడు ఆందోళనల కారణంగా మరో జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది. ఇవే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలయ్యాయి. రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలును రేషన్ పద్ధతిలో అమ్ముతున్నారు. అక్కడ కొనాలంటే ఐదారు గంటలు పడుతోంది. పని కూడా మానేసుకుని ఇక్కడ ఒక రోజంతా వేచి చూడాల్సి వస్తోందని హీరోజిత్ సింగ్ అనే వ్యక్తి చెప్పారు. అయితే బ్లాక్లో కొనాలంటే మాత్రం ఐదు నిమిషాల్లోనే దొరుకుతోందని, ఇదెలా సాధ్యం అవుతోందని ఆయన ప్రశ్నించారు.