
47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం!
విమాన ప్రయాణమంటే రోజురోజుకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.
విమాన ప్రయాణమంటే రోజురోజుకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం కూలిపోయింది. ఈ విమానంలో 47 మంది ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-661 విమానం చిత్రాల్ నగరం నుంచి ఇస్తామాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో అబోటాబాద్ సమీపంలో రాడర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి.
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని హవేలియన్ పట్టణ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోయిన సమాచారం తెలియడంతో రక్షణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో ప్రముఖ గాయకుడు, వ్యాపారవేత్త జునైద్ జంషెద్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. విమానం కూలిన ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారని పేర్కొంది.