ఉదాసీనతే అసలు దోషి! | Pilgrims killed in stampede on bridge leading to Ratangarh temple in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఉదాసీనతే అసలు దోషి!

Published Wed, Oct 16 2013 1:18 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఉదాసీనతే అసలు దోషి! - Sakshi

ఉదాసీనతే అసలు దోషి!

మరోసారి పాలకుల నిర్లక్ష్యం 115 నిండు ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ ఆలయంలో తొక్కిసలాట మరిన్ని వందలమందిని గాయాలపాలు చేసింది. మరణించినవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే. పుణ్యక్షేత్ర సందర్శనకెళ్లిన యాత్రికుల భద్రత విషయంలో ఎన్నెన్ని చేదు అనుభవాలు ఎదురైనా ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్వడంలేదని ఈ ఘటన నిరూపించింది. రతన్‌గఢ్ ఆలయం దాటియా జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలో ఉంది. ఈ ఆలయం సమీపంలోని సింధు నదిలో ఏడేళ్లక్రితం ఒక్కసారి ప్రవాహం ముంచుకురావడంతో పడవ తలకిందులై 57మంది మరణించారు. పడవలపై నదిని దాటే దుస్థితిని తొలగిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగబోవని భావించి మూడేళ్లనాడు వంతెన నిర్మించారు. కానీ, ముందు జాగ్రత్తలను తీసుకోలేని అశక్తులు ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటే... ఏదో ఒకమూల మృత్యువు పొంచి ఉండి కాటేయకమానదని తాజా ఘటన రుజువు చేస్తోంది.
 
  దేవీ నవరాత్రుల్లో ఆలయానికి నిత్యమూ వేలాది మంది భక్తులు వస్తారని, ఆ జనసమ్మర్థానికి అనుగుణంగా వంతెన నిర్మాణం ఉండాలని అప్పట్లో పాలకులు అనుకో లేదు. ఇప్పుడు ఆ ఇరుకైన వంతెనే రాకపోకలకు ఆధారమైంది. ఒకరకంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఘటన జరిగిన సమయానికి దానిపై 25,000మంది భక్తులున్నారు. వంతెనకున్న రెయిలింగ్‌ను ఒక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన తర్వాత వంతెన కూలిపోతున్నదని వ్యాపించిన వదంతితో ఒక్కసారిగా భక్తుల్లో భయాందోళనలు చెలరేగి ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భయకంపితులైన కొందరు వంతెన పైనుంచి నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. అలాగే, మృతుల సంఖ్యను తగ్గించి చూపడం కోసం పోలీసులే కొన్ని శవాలను నదిలోకి విసిరేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
  ఆలయాలవద్ద తొక్కిసలాటలు జరిగిన ఉదంతాలు గతంలో ఎన్నో ఉన్నాయి. నేర్చుకోదల్చుకున్నవారికి అవన్నీ గుణపాఠాలే. 2008 ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి ఆలయంవద్ద తొక్కిసలాట జరిగి 162 మంది చనిపోయారు. ఆ మరుసటి నెలలోనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చాముండాదేవి ఆలయంలో ఇదే పునరావృతమై 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లో మహారాష్ట్రలోని మంధర్‌దేవి ఆలయంవద్ద జరిగిన తొక్కిసలాట 304 మంది ఉసురుతీసింది. 
 
 రెండేళ్ల క్రితం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో తొక్కిసలాట జరిగి వందమందికిపైగా భక్తులు దుర్మరణంపాలయ్యారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా న్యాయ విచారణ కమిషన్‌లను నియమించడం రివాజుగా మారింది. ఆ కమిషన్‌ల అధ్యయనంలో ఎలాంటి లోపాలు వెల్లడయ్యాయో, వాటి నివారణకు అవి సూచించిన మార్గాలేమిటో తెలుసుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. అందువల్లే ఈ తరహా ప్రమాదాలు పదే పదే జరుగు తున్నాయి. రతన్‌గఢ్ ఆలయంలో 2007లో జరిగిన దుర్ఘటనపై విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక ఏమూలో దుమ్ముకొట్టుకుపోయి ఉంది. ఆరేళ్లవుతున్నా మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అసెంబ్లీ ముందుంచలేదు. భక్తులు వేల సంఖ్యలో అక్కడికొస్తారని, పడవలపై నదిని దాటుతారని తెలిసినా నిర్లక్ష్యంగా రిజర్వాయర్ గేట్లు తెరిచారని, ఫలితంగా నదీప్రవాహం పెరిగిందని ఆ నివేదిక చెప్పినా ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. అక్కడ విధుల్లో ఉండాల్సిన పోలీసు అధికారులు ఆ సమయానికి ఎటో వెళ్లిపోయారని తేలినా సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు లేవు. 
 
 ఘటనలకూ, విచారణ కమిషన్‌లు నివేదిక ఇవ్వడానికీ మధ్య ఎన్నో నెలలు గడిచిపోతాయి గనుక...‘అయిందేదో అయింది, ఇప్పుడు చర్యలెందుకులే’నన్న ఉదాసీనత ప్రభుత్వాలను ఆవరిస్తున్నది. జనం ప్రాణాలకు గడ్డిపోచ విలువ కూడా ఇవ్వని ఇలాంటి వైఖరే మళ్లీ మరో ఘటనకు తావిస్తున్నది. రతన్‌గఢ్ ఆలయానికి ఏటా ఈ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని ప్రభుత్వానికి తెలుసు. అదేచోట కొన్నేళ్లక్రితం విషాద ఘటన జరిగిందని కూడా తెలుసు. అయినాసరే, ఇంతమంది భక్తుల రద్దీని క్రమబద్ధం చేయడానికి అక్కడ నియమించిన భద్రతా సిబ్బంది 60 మంది పోలీసులు మాత్రమే. వంతెనపై కేవలం డజనుమంది పోలీసులు మించిలేరు. ఈమధ్యే జరిగిన బీజేపీ బహిరంగ సభకు 12మంది ఐపీఎస్‌లు, 60మంది ఇతర ఉన్నతాధికారులతోపాటు 5,000మంది పోలీసు సిబ్బందిని నియమించారట. లక్షలమంది వచ్చే ఆలయంవద్ద మాత్రం కేవలం 60మంది సిబ్బంది సరిపోతారని ఎలా అనుకున్నారో?! ఇంత జరిగాక ఇప్పుడు అధికారులు రకరకాల సాకులు చెబుతున్నారు. సాధారణంగా దీపావళి అనంతరం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటారని, ఈసారి తమ అంచనాలకు భిన్నంగా ఆదివారం దాదాపు 4 లక్షల మంది వచ్చారని వారు అంటున్నారు. యూపీకి చెందిన కొందరు యువకులు వదంతులు వ్యాప్తిచేశారని చెబుతున్నారు.
 
  తగిన బందోబస్తు ఉంటే వీటన్నిటినీ ఎదుర్కోవడం సాధ్యమయ్యే దని మాత్రం వారు గుర్తించినట్టు లేరు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగ బోతున్నాయి గనుక ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. జిల్లా కలెక్టరు, ఎస్పీతోసహా 21మంది అధికారులను సస్పెండ్‌చేసింది. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిషన్‌ను రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని, ఆ నివేదిక వచ్చిన పక్షం రోజుల్లో చర్యలుంటాయని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెబుతున్నారు. అందులో తమ వంతు పాపం ఎంత ఉన్నదో నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే జనం విశ్వసిస్తారని ఆయన తెలుసుకోవాలి. కనీసం ఈ ఘటన నుంచి అయినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే కాదు...అన్ని ప్రభుత్వాలూ గుణపాఠం నేర్వాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవడం అలవాటుచేసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement