కాక్ పిట్ లో మాజీ క్రికెటర్ భార్య
లాహోర్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. విమానం కాక్ పిట్ లోకి వెళ్లి పైలట్ ను చిక్కుల్లో పడేశారు. లండన్ నుంచి లాహోర్ కు వస్తున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ) విమానంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పీఐఏ దర్యాప్తు చేపట్టింది.
కాసేపు కాక్ పిట్ లో కూర్చుంటానని రెహమ్ ఖాన్ అడగ్గా పైలట్ అంగీకరించాడు. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆమె కాక్ పిట్ లో కూర్చుంది. దీనిపై పీఐఏ కన్నెర్ర జేసింది. పైలట్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అనధికారిక వ్యక్తులకు కాక్ పిట్ లో ప్రవేశం లేదని, నిబంధనలకు ఉల్లంఘించిన పైలట్ పై చర్య తప్పదని తెలిపింది.
టీవీ జర్నలిస్టుగా పనిచేసిన రెహమ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లాడింది. పది నెలలు గడవకుండానే ఇద్దరూ విడిపోయారు. తాము విడిపోతున్నట్టు అక్టోబర్ 30న ప్రకటించారు. తన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో రెహమ్ ఖాన్ కు ఇమ్రాన్ విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.