గత నెలలో నమీబియాలో మొజాంబిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి కుప్పకూలిపోయి, అందులో ఉన్న మొత్తం 33 మంది మరణించిన విషయం గుర్తుంది కదూ. ఆ విమానాన్ని సాక్షాత్తు పైలటే కావాలని కూల్చేశాడట!! మొజాంబిక్ నుంచి అంగోలా వెళ్తున్న ఆ విమానం నమీబియాలోని గేమ్ పార్కులో నవంబర్ 30వ తేదీన కూలిపోయింది. ఆ విమాన పైలట్ కావాలనే ఆ విమానాన్ని కూల్చేసినట్లు బీబీసీ ఆదివారం తన కథనంలో పేర్కొంది.
అయితే ఆయనలా చేయడానికి కారణమేంటో ఇంతవరకు తెలియలేదు. ఆ విమానాన్ని ఎలాగైనా కూల్చేయాలని పైలట్ హెర్మినో డాస్ శాంటాస్ ఫెర్నాండెజ్ భావించాడని మొజాంబిక్ పౌర విమానయానశాఖ అధిపతి జావో ఆబ్రూ తెలిపారు. పైలట్ తనను తాను కాక్పిట్లో బంధించుకున్నారని, కో పైలట్ను కూడా లోనికి రానివ్వలేదని ఆయన చెప్పారు. ఆ సమయంలో అలారం మోగిన చప్పుడు, తలుపు పదేపదే బాదిన చప్పుడు వినిపించాయని కూడా తెలిపారు. దీన్నిబట్టి చూస్తే పైలట్ కావాలనే విమానాన్ని కూల్చేసినట్లు స్పష్టం అయ్యిందన్నారు. అంతేకాదు, విమానం ఎగిరే ఎత్తును, దాని వేగాన్ని కూడా ఆయనే మార్చాడని తెలిపారు. ఆ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 27 మంది ప్రయాణికులు మరణించారు.
కావాలనే విమాన్ని కూల్చేసిన పైలట్!!
Published Sun, Dec 22 2013 4:58 PM | Last Updated on Thu, Aug 9 2018 8:17 PM
Advertisement
Advertisement