సభకు మోదీ.. కాంగ్రెస్ హక్కుల తీర్మానం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో గురువారం తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభకు హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడనున్నారు. పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని పట్టుబడుతూ ప్రతిపక్షాలు గత మూడురోజులుగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ప్రధాని సభకు రావాలన్న డిమాండ్‌తో విపక్షాలు నిరసన చేపట్టడంతో రాజ్యసభ సమావేశాలు అర్ధంతరంగా పలుసార్లు వాయిదాపడిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రధాని మోదీ సభలో మాట్లాడకుండా.. బయట మాట్లాడుతున్నారని, చర్చనుంచి ఆయన పారిపోతున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు.