విషప్రయోగం వల్లే సునంద మరణం
విషప్రయోగం వల్లనే కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మరణించారని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సి తెలిపారు. సునంద మృతిపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నుంచి పోస్టుమార్టం నివేదిక డిసెంబర్ 29వ తేదీన తమకు అందినట్లు ఆయన చెప్పారు. మరణం 'అసహజం' అని, 'విషప్రయోగం' వల్లే సంభవించిందని అందులో వైద్యులు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఆమె మృతి కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు.
కాగా.. సునందా పుష్కర్ది సహజ మరణం లేదా ఆత్మహత్య కాదని, ఆమె హత్యకు గురయ్యారని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఇప్పుడు ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదికతో ఆయన వాదనకు మరింత బలం చేకూరింది. సునంద విషయం తీసుకోవడం గానీ, ఎవరైనా ఇంజెక్ట్ చేయడం గానీ చేసి ఉంటారని పోలీసు కమిషనర్ బస్సి చెప్పారు.