విషప్రయోగంతోనే సునందా పుష్కర్ మరణం | Poison that killed Sunanda Pushkar: All you need to know about Polonium-210 | Sakshi
Sakshi News home page

విషప్రయోగంతోనే సునందా పుష్కర్ మరణం

Published Wed, Jan 7 2015 3:27 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

కేంద్ర మంత్రి శశిథరూర్, ఆయన భార్య సునందా పుష్కర్(ఫైల్) - Sakshi

కేంద్ర మంత్రి శశిథరూర్, ఆయన భార్య సునందా పుష్కర్(ఫైల్)

* తాజాగా హత్య కేసు నమోదు
* విషప్రయోగంతో మరణం
* విషాన్ని ఇంజెక్ట్ చేశారని అనుమానం
* ఆ విషం రేడియోధార్మిక పొలోనియం 210?
* నిర్ధారణ కోసం విదేశాలకు శాంపిల్స్
* తాజాగా హత్య కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

 
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. అది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు.  
 
 న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. అది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు. సునంద మృతిచెంది సంవత్సరం గడచిన తరువాత ఈ కేసు నమోదు కావడం విశేషం.
 
 ఆమె హత్యకు గురైందని, ఈ కేసుపై దర్యాప్తు జరుపుతామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ మంగళవారం స్పష్టం చేశారు. థరూర్‌ను కూడా ప్రశ్నిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302(హత్య) సహా పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ‘ఆమెకు ఎవరైనా బలవంతంగా విషాన్ని ఇచ్చారా? లేక ఆమే స్వయంగా విషాన్ని తీసుకున్నారా? అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతాం’ అన్నారు. ‘ఆ విషం ఏమిటి? ఎంత మొత్తంలో తీసుకున్నారన్నది నిర్ధారణ కాలేదు. కానీ విషాన్ని ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేసి ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు’ అని చెప్పారు.  ఆ విషం ఏమిటనేది తెలుసుకోవడానికి ఆమె అవయవ భాగాలను విదేశాలకు పంపి పరీక్ష చేయించాల్సి ఉందన్నారు. కాగా, ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
 అది పొలోనియం 210?
 సునంద మృతికి కారణమైన విష పదార్థం భారతీయ ప్రయోగ శాలల్లో గుర్తించలేని రేడియోధార్మిక ఐసోటోప్ అయ్యే అవకాశమున్న దృష్ట్యా ఆమె శరీర అంతర్భాగాలను అమెరికాలోని ఎఫ్‌బీఐ ప్రయోగశాలకు కానీ, బ్రిటన్‌కు కానీ పంపించనున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు, అది పొలోనియం 210 అనే అత్యంత విషపూరిత రేడియోధార్మిక ఐసోటోప్ అని పోలీసులు అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ఆ విషపదార్థం.. థాలియం, పొలోనియం 210, నెరియం ఒలియాండర్, పాము విషం, హెరాయిన్‌లలో ఒకటై ఉండొచ్చని ఎయిమ్స్ ఫారెన్సిక్ విభాగం అందించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపాయి.
 
 అల్ప్రాక్స్ ఓవర్‌డోస్‌తో కాదు..!
 సునంద మరణంపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం డిసెంబర్ 29న ఢిల్లీ పోలీసులకు మరో నివేదికను సమర్పించింది. సునంద విషప్రభావంతో మరణించారని, డిప్రెషన్‌ను తట్టుకోవడం కోసం వాడే అల్ప్రాక్స్ మాత్రల ఓవర్‌డోస్ వల్ల కాదని అందులో పేర్కొన్నారు. కాగా, సునందది ఆత్మహత్య కాదని, విషమిచ్చి హత్య చేశారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. కాగా, సునంద మరణం కేసుపై ఢిల్లీ పోలీసులు ఇటీవలే మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మరణించిన హోటల్ గదిని తనఖీ చేయడంతో పాటు హోటల్ సిబ్బందిని, శశిథ రూర్ వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించారు.  సునంద వాడిన మూడు మొబైల్ ఫోన్లను, లాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నారు. ఆమె మరణం తరువాత ఈ పరికరాల నుంచి  ఏదైనా సమాచారాన్ని తొలగించారా అన్న కోణంలో పరిశోధిస్తున్నారు.
 
 ఇంజెక్షన్ గుర్తులు.. పంటిగాట్లు!
 సునంద మరణం తరువాత ఫోరెన్సిక్ వైద్యులు విడుదల చేసిన మొదటి నివేదికలో ఆమె డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల చనిపోయారని, ఆమె శరీరంపై 12 గాయాల గుర్తులున్నాయని పేర్కొన్నారు. అనంతర అటాప్సీ నివేదికలో మరణానికి కారణం విషమేనని, గాయాల గుర్తులు 15 అని, వాటిలో ఒకటి ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తు, మరొకటి పన్నుగాటుగా వెల్లడించారు. అనంతరం సునందది సహజమరణమని నివేదిక ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి సుధీర్ కుమార్ గుప్తా ఆరోపించారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.
 
 పాక్ జర్నలిస్ట్‌తో సాన్నిహిత్యంపై గొడవ

 గత ఏడాది జనవరి 17న తాము బసచేసిన లీలాప్యాలెస్ హోటల్, రూమ్ నంబర్ 345లో సునంద(52) మరణించి ఉండడాన్ని చూసిన శశిథరూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు, శశిథరూర్‌కు, సునందకు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయని, వారు తరచూ గొడవపడుతున్నారని వార్తలు వచ్చా యి. దాంతో సునందా మృతి అనుమానాస్పదం గా మారింది. అలాగే, మరణించడానికి రెండు రోజుల ముందు ఆమె మెహర్ తరార్ అనే పాకిస్తానీ పాత్రికేయురాలితో ట్వీటర్‌లో గొడవ పడ్డా రు. ఆ జర్నలిస్ట్ శశిథరూర్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు అప్పుడు సునంద ఆరోపిం చారు. అయితే, సునంద మరణానికి ఒకరోజు ముందే తామిద్దరి మధ్య విభేదాలేం లేవ ని, సంతోషంగా ఉన్నామని థరూర్, సునందలు సంయు క్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement