
నిర్ణయాల్లో దేశ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: మనం తీసుకునే నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతం కలిగించకూడదని, అలాగే నిరుపేదలకు హాని చేయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. ఈ రెండు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని దేశానికి సేవచేయాలన్నారు. విధానాల కంటే రాజకీయాలది ఎప్పుడూ పైచేయి కాకూడదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సహాయ కార్యదర్శులుగా మూడు నెలల శిక్షణ పూర్తిచేసుకున్న ట్రెయినీ ఐఏఎస్‌లు గురువారం ప్రధాని మోదీని కలసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రెజెంటేషన్లు ఇచ్చారు.
స్వచ్ఛ భారత్, ఈ కోర్టులు, పర్యాటకం, వైద్యం, పరిపాలనలో అంతరిక్ష సాయంపై చేసిన పరిశీలనలు బాగున్నాయంటూ మోదీ కితాబిచ్చారు. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్ర ఆహారం వల్ల దేశంలో ఏటా లక్షమంది చిన్నారులు మరణిస్తున్నారని, అలాగే రూ. 3.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఒక ఐఏఎస్ నివేదిక సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 12 శాతం మంది బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ట్రైనీ ఐఏఎస్ స్వధా దేవ్ సింగ్ తన పరిశీలనలో గుర్తించారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
10 గ్రూపుల ఏర్పాటు
కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో 10 గ్రూపులు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయిం చారు. ఈ గ్రూపులు వ్యవసాయం, ఇంధనం, రవాణా వంటి విభాగాలపై పని చేసి వచ్చే నెల చివరికి నివేదికలు సమర్పిస్తాయి. గురువారం అన్ని శాఖల కార్యదర్శుల భేటీ సందర్భంగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 8 గ్రూపుల కార్యదర్శులు ఇచ్చిన నివేదికలకు కొనసాగింపుగా కొత్త గ్రూపులు పనిచేస్తాయి.