రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు, కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదల కాగానే రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళతాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ రాష్ట్రపతి, గవర్నర్‌ల ద్వారా కేంద్రమే నిర్వహిస్తుంది.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి మండలి నిన్న సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి మండలి నిన్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో సమావేశమే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973 జనవరి 11 నుంచి 1973 డిసెంబరు 10 వరకు 11 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పటంతో అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రం ఇప్పటివరకు సుమారు 120 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది.