బాబు మౌనమే ఏపీకి శాపం: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి కేంద్రం డబ్బులిస్తామని చెప్పి ఇవ్వడం లేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. వీటన్నింటినీ ఎత్తిచూపే సమయం ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు మౌనం ఏపీకి శాపంగా మారింది. బాబుకు ప్రధాని మోదీతో రాజకీయ పొత్తు ముఖ్యమా.. లేక ప్రజలతో పొత్తు పెట్టుకోవడం ముఖ్యమా..?’ ఆలోచించుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు.
బిహార్‌కు మోదీ రూ.లక్షా 25 వేల కోట్లు ప్రకటించినప్పటికీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్న బాబు ఏపీ విషయంలో ఏమీ మాట్లాడని వైఖరిని తప్పుపట్టాల్సిందే అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించిన అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము చూసిన ఆత్మహత్యలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయని, యువతీయువకులు ధైర్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని ఓ సోదరిలా విన్నవిస్తున్నానన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించుకోవడానికి ఏపీతో కలసి కేంద్రంపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని, బాబు కూడా పారదర్శకతతో ముందుకు రావాలని పిలుపునిచ్చా రు. తాగు, సాగునీటి ఇబ్బందులకు బాబు వైఫల్యమై కారణమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులపై నిలదీయకపోవడం వల్లే కృష్ణా, గోదావరి జలాల కొరత ఉందన్నారు.
రాజకీయ పొత్తులో ఉన్న విషయాన్ని మరిచి తెలుగువారిగా నీటి ఉద్యమాలకు కలసి రా వాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని కడుతుండగా, నిలిపివేయించడానికి బాబు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోర్ అంశాలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజనలో కమిటీలు వేయకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డా రు. కేంద్ర మంత్రి వెంకయ్య అభిప్రాయాల కన్నా చట్టంలోని అంశాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రాధాన్యతనివ్వాలన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్‌కు పరామర్శ
టీఆర్‌ఎస్ ఎంపీ కవిత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించారు. రాష్ట్రపతి సతీమణి సువ్రాముఖర్జీ మృతిపట్ల సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సునీతా మహేందర్ రెడ్డి, కోవ లక్ష్మి, శ్రీనివాస్‌గౌడ్, పుట్టా మధు, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, గణేష్ గుప్తా, రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.